రాజకీయాలకతీతంగా ప్రజాసేవ : ఎంపీ రఘురాంరెడ్డి
✍️ ఖమ్మం – దివిటీ (జులై 7)
రాజకీయ పార్టీలకతీతంగా ప్రజాసేవ చేయడమే తన లక్ష్యమని, అందరివాడిగా ఉండి తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమగ్రాభివృద్ధికి కృషిచేస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నగరంలోని వీడీఓస్ కాలనీలోని సాయిబాబా ఆలయానికి వెళ్లి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం కరుణగిరిలోని ఫోర్త్ ఎంప్లాయీస్ చర్చిని సందర్శించి అక్కడ ప్రార్ధన చేశారు. ఆ తర్వాత సీపీఎం, సీపీఐ(మాస్ లైన్) ప్రజా పంథా జిల్లా కార్యాలయాలకు వెళ్లి ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చి భారీవిజయానికి సహకరించినందుకు ఆ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు ఎంపీకి సాదర స్వాగతం పలికారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ, తన విజయాన్ని అందరి విజయంగా భావిస్తానన్నారు. ఇండియా కూటమి అభ్యర్థిగా ప్రజాస్వామ్య పరిరక్షణకు తనవంతుగా లోక్ సభలో గళం విప్పుతానన్నారు. లోక్ సభలో ప్రతిపక్షహోదాలో ఉన్న తాము రాహుల్ గాంధీ నేతృత్వంలో ముందుకు సాగుతామని తెలిపారు. ఓ ఎంపీగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, ఏ సమస్యవచ్చినా తనను నేరుగా కలిసి విన్నవించవచ్చని అభయమిచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ, నిరంకుశ బీజేపీ విధానాలను నిలువరించేందుకు ఇండియా కూటమికి మద్దతిచ్చామని, భవిష్యత్తులోనూ ప్రజాపోరాటాలలో కలిసి వస్తామన్నారు. వారు సీతారామప్రాజెక్ట్, రైతాంగ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకురాగా, జిల్లాలోని మంత్రులతో సంప్రదించి త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు కొప్పుల చంద్రశేఖరరావు, మిక్కిలినేని నరేందర్, సీపీఎం నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, యర్రా శ్రీకాంత్, సుబ్బారావు, కళ్యాణo వెంకటేశ్వరరావు, బషీరుద్దీన్, డాక్టర్ భారవి, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెoకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ , గుర్రo అచ్చయ్య, ఆవుల వెంకటేశ్వర్లు, ఆవుల అశోక్, బందెల వెంకయ్య, సీవై.పుల్లయ్య, శివలింగం, కమ్మకోటి నాగేశ్వరరావు, పుసులూరి నరేందర్, ఝాన్సీ, ఆజాద్, కె.శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
నేడు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయాల్లో వైఎస్ జయంతి వేడుకలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను ఖమ్మం, కూసుమంచిలో ఉన్న తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాల్లో సోమవారం ఉదయం 10గంటలకు నిర్వహిస్తున్నట్లు ఆ క్యాంప్ కార్యాలయాల ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరుగనున్న ఈ వేడుకల్లో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఉదయం 10-30గంటలకు పాల్గొంటారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధికసంఖ్యలో హాజరై ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.