పాఠశాల పనుల్లో నాణ్యతలోపంపై కలెక్టర్ ఆగ్రహం
పాఠశాల పనులు తనిఖీ చేసిన కలెక్టర్ ప్రియాంకఅల
✍️ కొత్తగూడెం – దివిటీ మీడియా (మే 23)
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా నిర్వహిస్తున్న పనుల్లో నాణ్యతలోపాలపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల ఆగ్రహం వ్యక్తం చేశారు. సుజాతనగర్ మండలం వేపలగడ్డలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్)లో జరుగుతున్న అమ్మ ఆదర్శ కమిటీ పాఠశాల పనులను గురువారం ఆమె తనిఖీ చేశారు. పనులు పరిశీలించిన కలెక్టర్, విద్యుద్ధీకరణ కోసం చేసిన పనుల్లో విద్యుత్తు తీగలు బయటకు వేలాడటం గమనించి, పనులు తాత్కాలికంగా చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరిగి మళ్లీ పాఠశాల తనిఖీకి వస్తానని, పనులన్నీ నాణ్యత పాటిస్తూ శాశ్వతమైన ప్రాతిపదికపై పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచి నీరు, మరుగుదొడ్లు, ఫ్యాన్లు, లైట్లు, అన్ని సౌకర్యాలకు పనులు నాణ్యతతో పూర్తిచేయాలని ఆదేశించారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని, అన్ని హంగులతో నూతన విద్యాసంవత్సరం ఆరంభానికి ఏర్పాట్లు చేయాలని జిల్లాకలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ విద్యాచందన, స్థానిక తహసిల్దార్ శిరీష, కొత్తగూడెం తహసిల్దార్ పుల్లయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
——————
డి.ఎం.ఎఫ్.టి పనులపై జిల్లా కలెక్టర్ సమీక్ష
—————
జిల్లాలో డి.ఎం.ఎఫ్.టి(డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ట్రస్ట్) ద్వారా చేపడుతున్న పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు గురువారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో డి.ఎం.ఎఫ్.టి ద్వారా పనులు చేపడుతున్న ఏజెన్సీలన్నీ సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం సాయంత్రంలోగా జిల్లాలో డి.ఎం.ఎఫ్.టి ద్వారా చేపడుతున్న పనుల పురోగతి, మొదలుపెట్టని పనులు, పురోగతిలో ఉన్న పనులు, పూర్తయిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికలు అందజేయాలని జిల్లాకలెక్టర్ అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనులన్నిటికీ క్వాలిటీ కంట్రోల్ నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో డీఆర్డీఓ విద్యాచందన, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ ఈఈలు, మున్సిపల్ కమిషనర్లు, డీఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.