అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
పార్లమెంట్ ఎన్నికల నియమావళి ప్రకారం ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నట్లు వెల్లడి
✍️ దివిటీ మీడియా, భద్రాద్రి కొత్తగూడెం (మే 7)
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళి ప్రకారం అంతరాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.రోహిత్ రాజు మంగళవారం తనిఖీలు చేశారు. పెనగడప, దమ్మపేట మండలంలోని మందలపల్లి, అల్లిపల్లి, అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం అశ్వారావుపేట అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్రమ నగదు, మద్యం, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లాలో అన్నిరకాలుగా భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో మొత్తం 12 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులు, 4 అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ చెక్ పోస్టులతోపాటు జిల్లాలో పోలీసులు చేపట్టిన వివిధ తనిఖీల్లో ఇప్పటివరకు రూ.1,19,50,531 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు చెప్పారు. దీంతోపాటు రూ.16,37,324 విలువ గల 2502 లీటర్ల మద్యం, రూ.2,06,85,300 విలువ గల 828 కిలోల గంజాయి, రూ.11,22,000 విలువ చేసే బంగారు, వెండి వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి మొత్తం రూ.3,53,95,155 (రూ.మూడు కోట్ల యాభై మూడు లక్షల తొంబై ఐదువేలు) స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. పర్యటనలో పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, అశ్వారావుపేట సీఐ జితేందర్ రెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్, శివరామకృష్ణ, దమ్మపేట ఎస్సై సాయికిషోర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.