28 కోట్ల రూపాయలకు పైగా విలువచేసే నిషేధిత గంజాయి దహనం
11.5 టన్నుల గంజాయి కాల్చేసిన డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ
✍ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 7
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 6 పోలీసు స్టేషన్లలో నమోదైన 33 కేసులలో వివిధ సందర్భాల్లో పట్టు బడిన నిందితుల వద్ద నుంచి సీజ్ చేసిన 11,545 కిలోల నిషేధిత గంజాయిని డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో దహనం చేశారు. గురువారం హేమచంద్రాపురం గ్రామశివార్లలో నిర్మానుష్యమైన అటవీప్రాంతంలో పర్యావరణ,కాలుష్యనియంత్రణ నిబంధనలు పాటిస్తూ దహనం చేశారు. దహనం చేసిన గంజాయి విలువ రూ.28 కోట్ల రూపాయల పైగా ఉంటుందని జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. ఛైర్మన్, సభ్యులైన భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, డీసిఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఆర్ఐ ఎంటీఓ, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు, ఆర్ఎస్సై జగన్ ఆధ్వర్యంలో కోర్టు వారి అనుమతితో దహనం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దశల వారీగా విభజించి దహనం చేశారు. ముందు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పోలీస్ స్టేషన్ల వారీగా భాగాలుగా విభజించి ఉంచిన గంజాయిని హెడ్ క్వార్టర్స్ లో తూకం వేసి పరిశీలించారు. అనంతరం ఆ మొత్తం గంజాయిని దగ్గర్లోని అటవీప్రాంతానికి తరలించి తగలబెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్.డి.పి.ఎస్ యాక్ట్ లోని నియమ నిబంధనల ప్రకారం జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో నిల్వ ఉన్న ఈ గంజాయిని దహనం చేసినట్లు తెలియజేశారు. అక్రమార్జనలో భాగంగా కొందరు గంజాయిని విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారని తెలిపారు. ఈ విధంగా ఆసాంఘిక కార్యాలపాలకు పాల్పడేవారిని అరికట్టడంకోసం జిల్లావ్యాప్తంగా రహస్యబృందాల్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి, ఇతర మత్తుపదార్థాలను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తుపదార్ధాలను సేవించేవారిపై కూడా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.