కొత్తగూడెంలో నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
నిందితుల వివరాలు వెల్లడించిన 3టౌన్ సీఐ మురళి
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 20
అక్రమంగా భారతదేశంలోకి చొరబడి నకిలీ ధ్రువపత్రాలను సృష్టించి, ఇక్కడే గడుపుతున్న నలుగురు బంగ్లాదేశీయులను కొత్తగూడెం 3టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలను కొత్తగూడెం 3టౌన్ సీఐ మురళి మంగళవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… కొత్తగూడెం 3టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని సఫాయి బస్తీలో ఒక ఇంటి నిర్మాణ పనులను చేస్తూ అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులను కొత్తగూడెం 3టౌన్ ఎస్సై విజయ సోమవారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడిన నలుగురు వ్యక్తులను విచారించగా వారు బంగ్లాదేశ్ కు చెందిన వారనే విషయం గుర్తించారు. అక్రమంగా మనదేశంలోకి చొరబడి ఇక్కడ నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకుని ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇక్కడే జీవిస్తున్నారని తేలిందని 3టౌన్ సీఐ మురళి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ నిందితులను విచారించిన క్రమంలో వారంతా బంగ్లాదేశ్ లోని జహేనైదాహ్ జిల్లా, మహేష్ పూర్ తానా పరిధిలోని గుర్థహ్, డాకతీయ, గాడపోట గ్రామాలకు చెందినవారని గుర్తించారు. ఈ మేరకు మహమ్మద్ ఆజాద్@షేక్ ఆజాద్ (24), మొహమ్మద్ రాబిన్ మియా(19), మహమ్మద్ అలామిన్ హోస్సేన్(19), మహమ్మద్ మోహిన్ (19) అనే నిందితులను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల వద్ద నుంచి నకిలీ ధ్రువపత్రాలు, బ్యాంకు పాస్ బుక్కులు, ఏటీఎం కార్డులు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీసీ 420, 468, 471, సెక్షన్ 14ఎ(బి) ఆఫ్ ఫారినర్స్ యాక్ట్-1946లోని సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మురళి ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విధంగా ఎవరైనా ఇతర దేశస్తులు, తమ చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా గానీ అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలని కూడా సీఐ మురళి ఈ సందర్బంగా విజ్ఞప్తి చేశారు.