వై.ఎస్.ఆర్ వారసత్వం జగన్మోహనరెడ్డిదా? షర్మిలదా?
దుమ్ము రేపుతున్న ఏపీ వారసత్వ రాజకీయాలు
✍🏽 దివిటీ మీడియా
దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి వారసత్వం కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో దుమ్ము రేగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కోట్ల మంది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వై.ఎస్.ఆర్ వారసత్వం ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తీవ్రమైన చర్చనీయాంశంగా మారి, ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.ఆర్ కూతురు షర్మిల, తన అన్న, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మీద చేస్తున్న విమర్శలు, ఆరోపణలు, వ్యతిరేక ప్రచారం తాజాగా వై.ఎస్.ఆర్ వారసత్వంపై చర్చకు దారితీసింది. ఈసారి ఎలాగైనా జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి మరలా అధికారం దక్కకుండా చేయాలనే ప్రయత్నంలో ప్రతిపక్ష పార్టీలన్నీ దాదాపు ఒక్కటయ్యాయి. తనను మరోసారి అధికారంలోకి రాకుండా చేయడమే తమ ఏకైక లక్ష్యంగా సాగుతున్న ప్రతిపక్షాల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కుని మరోసారి చారిత్రాత్మక విజయం సాధించేందుకు ప్రస్తుత సీఎం జగన్మోహనరెడ్డి గట్టిగా పోరాడుతున్నారు.
ఓవైపు టీడీపీ-జనసేన పార్టీల విమర్శలకు ధీటైన జవాబునిస్తున్న వైఎస్సార్సీపీని ఇరుకున పెట్టేందుకు సీఎం జగన్మోహనరెడ్డి ప్రత్యర్థులు షర్మిలను రంగంలోకి దించడం, ఆమె సోదరుడి మీదే పదునైన విమర్శలు చేస్తుండటంతో రాజకీయం వాడి వేడిగా మారింది. ఎంతైనా షర్మిల వై.ఎస్.ఆర్ కూతురనే ఆలోచనతో ఆరంభంలో షర్మిల విమర్శలను పట్టించుకోని వైఎస్సార్సీపీ నాయకులు, తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను టార్గెట్ చేసేలా మారిపోయింది. ఈ నేపథ్యంలో త్వరలోనే జరుగనున్న ఎన్నికల్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి వారసత్వం జగన్మోహనరెడ్డిదా? లేకపోతే షర్మిలదా? అనేది ప్రజల్లోనే తేలాల్సిన పరిస్థితేర్పడింది. వై.ఎస్.ఆర్ మరణానంతరం ఇప్పటివరకు జరిగిన పరిణామాలను విశ్లేషిస్తే ఇప్పటివరకు జగన్మోహనరెడ్డినే ఆయన రాజకీయ వారసుడిగా ప్రజలు భారీగా మద్దతు పలికిన విషయం తెలిసిందే. ఇంతకాలం తర్వాత ఈ వారసత్వం విషయంలో షర్మిల కూడా పోటీకి రావడం ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది చర్చకు దారి తీసింది. రాజకీయ విబేధాలతోనో లేకపోతే కుటుంబంలోని విబేధాల కారణంగానో సొంతంగా రాజకీయ భవిష్యత్తును వెతుక్కునేందుకు షర్మిల తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటి వరకు స్థిరత్వం లేకపోవడంతో ప్రజలు విశ్వసించలేని స్థితి ఏర్పడుతోంది. తెలంగాణలో తమకు రాజకీయ అవకాశం లేదనే బాధలో ఉన్న వై.ఎస్.ఆర్ అభిమానులకు ఆశలు రేకెత్తించిన షర్మిల, వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో ఒక పార్టీనే స్థాపించి, పాలకపక్షంపై దూకుడుగా పోరాడారు. ఒక దశలో అప్పటి బలమైన ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలతో సమానంగా కేసీఆర్ ప్రభుత్వంపై పోరాడుతూ పాదయాత్ర చేశారామె. కానీ ఒక స్థిరమైన లక్ష్యం లేకుండా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఆమెను కనీసం ఎమ్మెల్యే స్థానంలో కూడా పోటీ చేయలేకుండా చేశాయి. తెలంగాణ ప్రజలు ఆమెను వై.ఎస్.ఆర్ వారసురాలిగా కూడా చూడలేకపోయారు. ఈ పరిస్థితుల్లో అప్పటివరకు తనను తాను తెలంగాణ ఆడబిడ్డగా చెప్పుకుంటూ వచ్చిన షర్మిల, ఏమీ చేయలేక తన రాజకీయ భవిష్యత్తు కోసం, గుర్తింపు కోసం ఏదో సాధించాలన్న ఆరాటంతో మళ్లీ ఆంధ్రప్రదేశ్ బాటపట్టారు.
రాష్ట్ర విభజనతో ఏపీలో మూలనపడి ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఆమెను అడ్డం పెట్టుకుని కాస్తయినా జనం నుంచి ఆదరణ పొందాలనే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే వై.ఎస్.ఆర్ వారసత్వంతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న జగన్మోహనరెడ్డినే ప్రజలు ఆ స్థానంలో చూస్తారు తప్ప, షర్మిలను వారసురాలిగా పెద్దగా పట్టించుకోరనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇకపోతే క్రైస్తవ సామాజికవర్గం నుంచి జగన్మోహనరెడ్డికున్న మద్దతు చెక్కు చెదరే అవకాశం కూడా తక్కువేనని, షర్మిల ప్రభావం 10 శాతం వరకు మాత్రమే ఉండవచ్చని అంచనా. సంక్షేమ పథకాలతో ఇప్పటికే పేద, మధ్యతరగతి ప్రజల మద్దతు కూడగట్టుకున్న జగన్మోహనరెడ్డి, మరోసారి రాష్ట్రంలో మళ్లీ అధికారం సాధించడం ఖాయమనే ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఆయన ఒక్కడిని దెబ్బతీయడం ఎవరికీ చేతగాక ప్రతిపక్షాలన్నీ కట్టగట్టుకుని వస్తున్నాయనే అంశం ప్రజల్లో జగన్మోహనరెడ్డికి ఉన్న మద్దతును మరింత పెంచే అవకాశాలున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వై.ఎస్.ఆర్ మరణానంతరం ఆయన అభిమానులలో కాంగ్రెస్ పార్టీపై పెరిగిన వ్యతిరేకతకు తోడు రాష్ట్ర విభజన కారణంగా ఆ పార్టీపై అన్ని వర్గాల ప్రజల్లో పెరిగిన ద్వేషం చల్లార్చడం షర్మిల వల్ల కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వై.ఎస్.ఆర్ మరణానికి కాంగ్రెస్ కారణమంటూ ఇంతకాలం విమర్శలు చేస్తూ వచ్చిన షర్మిల, ఇప్పుడు ఆ పార్టీలోనే చేరడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తోంది. జగన్మోహనరెడ్డి ఓటుబ్యాంకును చీల్చి లబ్ధిపొందాలని చూస్తున్న ప్రతిపక్షాలకు, షర్మిల వల్ల కాస్తోకూస్తో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయే ప్రమాదం పొంచి ఉందనే భయం కూడా ఉంది. టీడీపీ, జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్ ఒంటరిపోరాటం ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను షర్మిల ద్వారా ఏమాత్రం తగ్గించగలిగే అవకాశం ఉందనేది అనుమానమే. పొత్తు కుదరక బీజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మరింతగా చీలిపోయి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లాభం పెరుగుతుందనేది సుస్పష్టం. ఈసారి ఎన్నికల్లో ఏపీలో సంక్షేమం, అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వం నినాదాలతోపాటు వైఎస్సార్ వారసత్వం కూడా ఓ అంశంగా మారుతోంది.