ఐటీసీ అనారోగ్య కాంట్రాక్టు కార్మికుడికి తోటివారి చేయూత
✍🏽 దివిటీ – బూర్గంపాడు (జనవరి 20)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లోని ఐటీసీ పేపర్ పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుడు కోటమర్తి శ్రీనుకు తోటి కార్మికులు, మేనేజర్లు శనివారం (జనవరి 20) రూ.35100 సాయం అందజేశారు. ఐటీసీ పేపర్ పరిశ్రమ ఎన్.ఎస్.ఎఫ్.టి డిపార్టుమెంటులో కాంట్రాక్టు కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కోటమర్తి శ్రీను ఆరోగ్య పరిస్థితి కొన్ని రోజుల నుంచి బాగాలేక విధులకు హాజరు కావడం లేదు. అతనిపైనే ఆధారపడిన కుటుంబ సభ్యులకు, అతని వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతున్న విషయం గుర్తించి అదే డిపార్టుమెంటులో పనిచేస్తున్న సహచరులు ఈ సహకారం అందించారు. ఎన్.ఎస్.ఎఫ్.టి డిపార్టుమెంటులో పని చేస్తున్న కార్మికులు, మేనేజర్లు, కాంట్రాక్ట్ కార్మికులు ఇతర దాతల సహకారంతో విరాళాలు సేకరించారు. ఆ విధంగా సమకూర్చిన రూ.35100, శనివారం స్థానిక గాంధీనగర్ ప్రాంతంలోని శ్రీను ఇంటికి వెళ్లి అందజేసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో శేషగిరిరావు, ఉమా, లెనిన్, సాంబారెడ్డి, నగేష్ కుమార్, రాజశేఖర్ రెడ్డి, శంకరయ్య, నరేష్, వేణు, రమణ, శ్రీనివాస్, రవి, శ్రీను, రామకృష్ణ, పలువురు తోటి ఉద్యోగులు పాల్గొన్నారు.