పుష్ప సినిమా నటుడు జగదీశ్ పై కేసు నమోదు, అరెస్టు
బెదిరించి మహిళ మృతికి కారకుడయ్యాడని అభియోగం
✍🏽 దివిటీ మీడియా – నేర విభాగం
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పక్కన సహాయకుడిగా కేశవ పాత్ర పోషించిన జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు బుధవారం (డిసెంబర్ 5) అరెస్టు చేశారు. ఓ మహిళా జూనియర్ ఆర్టిస్టు మరో వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉండగా ఫొటోలు తీసిన జగదీశ్, వాటిని సోషల్ మీడియా లో పోస్టు చేస్తానని ఆమెను బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగంతో నటుడు జగదీశ్ ను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. పంజాగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న ఆ మహిళ జూనియర్ అర్టిస్టు నవంబరు 29వ తేదీన ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళ ఆత్మహత్యకు కారణాలను సేకరించారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం… నవంబరు 27వ తేదీన ఆమె ఓ వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉండగా, ఆమెకు తెలియకుండా జగదీశ్ ఫొటోలు తీశాడని తెలిపారు. ఆ ఫొటోలు అడ్డం పెట్టుకుని ఆ తర్వాత జగదీశ్ బెదిరించడం వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆర్టిస్ట్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుందని వెల్లడించారు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న బండారు జగదీశ్ అలియాస్ కేశవను బుధవారం అరెస్టు చేసినట్లు వెల్లడించి, రిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న మహిళతో గతంలో జగదీశ్ కు సినీరంగంలో పరిచయం ఉందని పోలీసులు ఈ సందర్భంగా తెలిపారు.