Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleTelangana

సత్ప్రవర్తనతో మళ్లీ పేరు ప్రతిష్టలు సాధించుకోవాలి

సత్ప్రవర్తనతో మళ్లీ పేరు ప్రతిష్టలు సాధించుకోవాలి

ఖైదీలకు జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ఉద్భోధ

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

అనవసరంగా పొరపాట్లు చేసి జైలుకు రావడం వలన సమాజంలో అప్రతిష్టపాలు కావడమే కాకుండా, కుటుంబాలకు కూడా చెడ్డపేరు వచ్చే అవకాశముందని, అందుకే ఎటువంటి తప్పులు చేయకుండా, జరిగింది కేవలం గుణపాఠంగా భావించి, జైలు నుంచి విడుదలకాగానే మంచిపేరు ప్రతిష్టలు తిరిగి సంపాదించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెషన్స్ జడ్జి వసంత్ పాటిల్ ఖైదీలకు ఉద్భోధించారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సోమవారం భద్రాచలంలో సబ్ జైల్ ఆవరణలో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ఏఎస్పీ పరితోష్ పంకజ్ తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించి, సబ్ జైల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మహాత్మాగాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన సబ్ జైల్లో ఖైదీలకు సూచనలిస్తూ, జరిగింది కేవలం ఓ గుణపాఠంగా భావించి ఇకముందు ఎలాంటి తప్పులు చేయకుండా మహాత్మాగాంధీ చూపిన మార్గంలో సత్యం, అహింస సూత్రాలు పాటించాలని చెప్పారు. గాందేయవాదాన్ని అలవర్చుకోవాలని, ఎన్ని అవాంతరాలు వచ్చినా సత్యాన్ని మాత్రమే పలకాలని, అబద్ధం చెప్పకూడదని, ఎదుటి మనిషి కావాలనే హింసను ప్రేరేపించినా, తొందరపడి తప్పులు చేయకూడదన్నారు. దీనిని ప్రతిరోజు మననం చేసుకొని హింస విడనాడి, అహింసా మార్గంలో నడవాలని, జైలునుంచి బయటకెళ్లిన తర్వాత మంచి పనులు ప్రారంభించి జీవితాన్ని బాగు చేసు కుని కుటుంబాలకు ఆసరాగా ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం సబ్ జైల్లో చూస్తున్న వాతావరణం బట్టి ఖైదీల్లో మంచి మార్పు కనిపిస్తోందని, ఇదే అలవాటుగా చేసుకోవాలన్నారు. విద్యాబుద్ధులు నేర్పించే గురువు, తల్లిదండ్రులు సక్రమ మార్గంలోనే మనలను నడిపించడానికి పలురకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని, కానీ కొంత మంది చెడు సావాసాలతో జీవితం పాడు చేసుకుంటున్నారని తెలిపారు. భవిష్యత్తు గురించి మనసులో పెట్టుకుని, తప్పుడు ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా, మంచి పనులు చేయడం అలవాటు చేసు కోవాలని, దీనివలన ఎవరు చెడు మార్గంలో పయనించరన్నారు. భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, తన సొంత రాష్ట్రం బీహార్ తో సహా, వేరే రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో జైళ్లలో సౌకర్యాలు చాలా బాగున్నాయని, ఖైదీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని చెప్పారు. తెలిసీ తెలియక తప్పులుచేసి జైలుకొచ్చిన తర్వాత మార్పు రావాలని పోలీసు శాఖ కోరుకుంటుందని తెలిపారు. ఖైదీలమనే ఆలోచన మనసులో కలగకుండా ఇంటిని మరిపించేలా చక్కటి వాతావరణంలో ఉండే విధంగా జైలు అధికారులు శ్రద్ధ చూడడం చాలా బాగుందన్నారు. ఈ సందర్భంగా సబ్ జైల్ పర్యవేక్షకుడు ఉపేందర్ మాట్లాడుతూ, తెలిసి తెలియక చేసిన పొరపాట్లతో జైలుకు వచ్చిన ఖైదీలకు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. రక రకాల వ్యక్తిత్వం గల ఖైదీలు వస్తుంటారని, వారిలో మార్పు రావడానికి తమ సిబ్బంది అందరూ వారితో కలిసిమెలిసి ఉండి వారు స్వతహాగా జీవించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఖైదీలకు వారికి నచ్చిన రంగంలో శిక్షణనిప్పించి, వారి మనసులో స్ఫూర్తి నింపి, వారు స్వతహాగా జీవించడానికి వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. త్వరలో పెట్రోల్ పంపులు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నామని, ప్రస్తుతం కొందరు ఖైదీలకు పెట్రోల్ పంపుల్లో పనిచేసి జీవనోపాధి పెంపొందించుకోవడానికి తమ వంతుగా అవకాశాలు కల్పించామన్నారు. ఖైదీల సంక్షేమం దినోత్సవం సందర్భంగా పురుష, మహిళా ఖైదీలకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. చెస్ లో బాబా, స్వామి నిరంజన్, క్యారమ్స్ లో రవి, రాజన్న, పాటలపోటీల్లో రమేష్, నరసింహరావు, వ్యాసరచనలో వంశీ, ముగ్గులపోటీల్లో అనూష, రాజకుమారి, మంచిప్రవర్తన కలిగిన ఖైదీల్లో భద్రయ్య, యేసులకు జిల్లా జడ్జి, ఏఎస్పీల చేతుల మీదుగా బహుమతులందించారు. ఖైదీలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుర్గాబాయి, ఎంసిహెచ్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య, జె.ఎం.ఎఫ్.సి రామారావు, వెంకటేశ్వర్లు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దేవదానం, కోర్టు సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, జైలు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

Divitimedia

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

Divitimedia

ముంపు ప్రాంత మండలాల్లో పర్యటించిన కలెక్టర్

Divitimedia

Leave a Comment