Divitimedia
Andhra PradeshHyderabadKhammamMahabubabadMuluguNational NewsPoliticsSpot NewsTelanganaWarangal

మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలు జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని

మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పథకాలు జాతికి అంకితం, శంకుస్థాపన చేసిన ప్రధాని

నాగ్ పూర్ – విజయవాడ ఆర్థిక కారిడార్ లోని కీలక రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన

హైదరాబాద్ – విశాఖపట్నం కారిడార్ పరిధిలో భారత్ మాల పథకంలో నిర్మించిన రహదారి జాతికి అంకితం

కీలక చమురు – గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టులు జాతికి అంకితం, శంకుస్థాపన

హైదరాబాద్(కాచిగూడ) – రాయచూర్ మధ్య కొత్త రైలుకు పచ్చజెండా

తెలంగాణ పసుపు రైతుల కోసం జాతీయ పసుపుబోర్డు ఏర్పాటుపై ప్రకటన

హన్మకొండ – మహబూబాబాద్ – వరంగల్ – ఖమ్మం జిల్లాల యువతకు అవకాశాల కోసం ఆర్థిక కారిడార్ ప్రకటన

సమ్మక్క – సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి రూ.900 కోట్లు కేటాయింపు

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

ప్రధానమంత్రి న‌రేంద్రమోదీ ఆదివారం తెలంగాణలోని మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో రూ.13,500 కోట్లకుపైగా విలువైన అనేక అభివృద్ధి ప‌థ‌కాలను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాప‌న చేశారు. వీటిలో రహదారి, రైల్వే, పెట్రోలియం-సహజ వాయువు, ఉన్నత విద్య వంటి కీలక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగానే ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ఒక కొత్త రైలు‌ను కూడా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ, పండుగల సమయం ఆసన్నమవుతోందని గుర్తుచేశారు. మరోవైపు పార్లమెంట్‌లో ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు (నారీశక్తి వందన్ అధినియం)కు ఆమోదం ద్వారా నవరాత్రి వేడుకల ఆరంభానికి ముందే ‘నారీశక్తి పూజా స్ఫూర్తి’ ఆవిష్కృతమైందని ప్రధాని అభివర్ణించారు.
   ఈ ప్రాంత ప్రజల జీవితాన్ని పరివర్తనాత్మకం చేయగల అనేక రహదారి అనుసంధాన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం పట్ల ప్రధాని హర్షం ప్రకటించారు. ఇందులో భాగమైన నాగ్‌పూర్-విజయవాడ ఆర్థిక కారిడార్‌ మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రవాణా రంగాన్ని బలోపేతం చేసి, వ్యాపార సౌలభ్యానికి తోడ్పడుతుందని చెప్పారు. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమలకు చేయూత లభిస్తుందన్నారు. ఈ కారిడార్‌ పరిధిలో 8 ప్రత్యేక ఆర్థిక మండళ్లు, 5 మెగా ఫుడ్ పార్కులు, 4 నౌకాయాన, సముద్రాహార సముదాయాలు, 3 ఫార్మా, ఔషధ సముదాయాలు, 1 జౌళి సముదాయం సహా పలు కీలక ఆర్థిక కూడళ్లు ఏర్పడతాయని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని హన్మకొండ, మహబూబాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల యువతకు అనేక ఉపాధి అవకాశాలు అందివస్తాయని తెలిపారు.
   ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులను ఓడరేవులకు చేర్చడంలో తెలంగాణ వంటి రాష్ట్రానికి రైలు, రోడ్డు అనుసంధాన ఆవశ్యకతను ప్రధాని నొక్కిచెప్పారు. దేశంలోని అనేక కీలక ఆర్థిక కారిడార్లు తెలంగాణ మీదుగా వెళ్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ఇవన్నీ తూర్పు, పశ్చిమ తీరాలతో కలిపే మాధ్యమం కానున్నాయన్నారు. ముఖ్యంగా తూర్పు తీరానికి చేరడంలో హైదరాబాద్- విశాఖపట్నం కారిడార్‌ పరిధిలోని సూర్యాపేట-ఖమ్మం విభాగం ఎంతగానో తోడ్పడగలదని, పరిశ్రమలు, వ్యాపారాల రవాణా, సంబంధిత ఇతర ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు. జక్లెయిర్-కృష్ణా విభాగంలో నిర్మిస్తున్న రైలు మార్గం కూడా ఇక్కడి ప్రజలకు ఎంతో ముఖ్యమైంది కాబోతోందని చెప్పారు.
   తెలంగాణ పసుపు రైతుల ప్రయోజనార్థం జాతీయ పసుపు బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రధాని ప్రకటించారు. పసుపు సరఫరా శ్రేణికి విలువ జోడింపుపై ఈ బోర్డు దృష్టి సారిస్తుందని, రైతుల కోసం మౌలిక సదుపాయాల మెరుగుదలకు తోడ్పడుతుందని ఆయన వివరించారు. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణసహా దేశవ్యాప్తంగా పసుపు పండించే రైతులందరికీ ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
   ప్రపంచవ్యాప్తంగా ఇంధనం-ఇంధన భద్రత రంగంలో తాజా పరిణామాలను ప్రధాని ప్రస్తావించారు. పరిశ్రమలకేగాక గృహావసరాల కోసం కూడా ప్రభుత్వం ఇంధన భద్రతపై భరోసా ఇస్తున్నదని ఆయన నొక్కిచెప్పారు. ఈ మేరకు 2014లో 14 కోట్లుగా ఉన్న వంటగ్యాస్ కనెక్షన్ల సంఖ్య 2023నాటికి 32 కోట్లకు పెరగడాన్ని ఉదాహరించారు. అలాగే ఇటీవల గ్యాస్ ధర తగ్గించడాన్ని కూడా ఆయన గుర్తుచేశారు. “దేశంలో వంటగ్యాస్‌ పంపిణీ నెట్‌వర్క్ విస్తరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని” ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇంధన భద్రత కల్పన దిశగా హసన్-చెర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించగలదని ప్రధాని తెలిపారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మధ్య బహుళ ఉత్పత్తుల పెట్రోలియం పైప్‌లైన్‌కు శంకుస్థాపన చేయడాన్ని ప్రస్తావిస్తూ, దీనివల్ల తెలంగాణలో వేలాది ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందివస్తాయని చెప్పారు.
   అంతకుముందు ప్రధానమంత్రి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో పలు భవనాలను ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విశ్వవిద్యాలయానికి ‘అత్యున్నత విద్యా సంస్థ’ హోదా కల్పించి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ములుగు జిల్లాలో కేంద్రప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనుందని ప్రధాని ప్రకటించారు. దాదాపు రూ.900 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవాల పేరిట “సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం”గా రూపుదిద్దుకుంటుందని తెలిపారు. ఈ ఉన్నత విద్యా సంస్థ ఏర్పాటుపై రాష్ట్ర ప్రజలను నరేంద్రమోదీ అభినందించారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, పార్లమెంటు సభ్యులు బండి సంజయ్‌కుమార్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Related posts

మూడేళ్లలో అర్హులందరికీ ఇళ్లు, ఆర్థిక భరోసా లక్ష్యం

Divitimedia

నిరుద్యోగ యువతకు సీఎం రేవంత్ రెడ్డి హామీలు

Divitimedia

సంతమాగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి పర్యటన

Divitimedia

Leave a Comment