గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి : ఎస్పీ డా.వినీత్
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగించుకుని భద్రాచలం గోదావరిలో విగ్రహాల నిమజ్జనం కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి కొత్తగూడెం, పాల్వంచ మీదుగా భద్రాచలం గోదావరిలో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిమజ్జనం కొరకు వినాయక విగ్రహాలను మండపాల నుంచి వీలైనంత త్వరగా బయలుదేరి పోలీసువారికి సహకరించాలని అయన కోరారు.
*
ఎస్పీ డాక్టర్ వినీత్ చేసిన సూచనలు…
*
గణేష్ శోభాయాత్రలో వాహనాలు రోడ్డుకు ఒకవైపునే వరుసగా ఒక క్రమ పద్ధతిలో వెళ్లాలి.
ట్రాఫిక్ నకు అంతరాయం కలిగించేవిధంగా రోడ్డుకు అడ్డంగా వాహనాలను నిలపరాదు.
డీజేలకు అనుమతి లేదు. సౌండ్ బాక్సులు మాత్రమే ఉపయోగించాలి.ఎవరైనా డీజేలు వాడితే పోలీసులు ఆ ఉత్సవ కమిటీవారిపై కేసు నమోదు చేసి, డీజేలను సీజ్ చేయడం జరుగుతుంది.
వినాయకవిగ్రహాలు తరలించే వాహనాలను నడిపే డ్రైవర్లు మద్యం సేవించి నడిపితే, వారిపై కఠిన చర్యలుంటాయి.
మద్యం సేవించి వాహనాలు నడిపే వాహన దారులపై చర్యల కోసం ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు చేపట్టడం జరుగుతుంది.
నిమజ్జనం ఊరేగింపు సమయాల్లో మద్యం సేవించి సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలిగించరాదు.
ఊరేగింపుగా వెళ్లే సమయాల్లో విద్యుత్తు షాక్ లకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి.
చెరువులు, నదుల వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలి.
ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు ‘నిఘా నేత్రం -7992123234’ నెంబరుకు వారి పేరు, చిరునామా, లొకేషన్ వాట్సాప్ ద్వారా పంపితే, ఆయా ప్రాంతాల్లో పోలీసుగస్తీని పెంచడం జరుగుతుంది.
గణేష్ నిమజ్జోత్సవాలలో భాగంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు, ఉత్సవకమిటీలు జిల్లాపోలీసులకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.