రవాణా వాహనాల ‘ఆటోమేటెడ్ టెస్టింగ్’ గడువు అక్టోబరు 1వరకు పెంపు
✍🏽 దివిటీ మీడియా – డిల్లీ
రవాణా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా ‘ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల’ ద్వారా మాత్రమే ఫిట్ నెస్ పరీక్ష తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇచ్చిన గడువు అక్టోబరు 1 వరకు పొడిగించింది. ఈ మేరకు గడువును పెంచుతూ తాజాగా గురువారం (సెప్టెంబర్ 21వ తేదీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెప్టెంబర్ 12వ తేదీన కేంద్ర మోటారు వాహన నిబంధనలు-1989 లోని నియమం -175 ప్రకారం విడుదల చేసిన నోటిఫికేషన్ జిఎస్ఆర్ 663(ఇ) ప్రకారం ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా మాత్రమే రవాణా వాహనాల ఫిట్ నెస్ తప్పనిసరిగా పరీక్షించే విధంగా అనుమతించారు. ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారా ‘ఫిట్ నెస్’ పరీక్షించిన వాహనాలను మాత్రమే రిజిస్టర్ చేసేందుకు అధికారులకు అనుమతించారు. 2022లో
ఏప్రిల్5న జారీచేసిన జిఎస్ఆర్ నోటిఫికేషన్ 272(ఇ)ప్రకారం అమలుతేదీలు ముందుగా ప్రకటించారు. 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి భారీవస్తువుల వాహనాలు, భారీప్యాసింజర్ మోటార్ వాహనాలకు, 2024 జూన్ 1వ తేదీ నుంచి మధ్యస్థ వస్తువుల వాహనాలు, మీడియం ప్యాసింజర్ మోటార్ వెహికల్స్, లైట్ మోటర్ వెహికల్స్ (ట్రాన్స్ పోర్ట్)కు ఈ ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ల ద్వారానే ఫిట్ నెస్ పరీక్షచేయాలని ప్రకటించారు. తాజాగా ఈ నిబంధన అమలు గడువు ఈ అక్టోబరు 1వ తేదీ వరకు పెంచారు.