Divitimedia
Bhadradri KothagudemHealthTelangana

మంచినీటి పైపులైన్ల లీకేజీలు తక్షణం మరమ్మతు చేయాలి

మంచినీటి పైపులైన్ల లీకేజీలు తక్షణం మరమ్మతు చేయాలి

పారిశుద్ధ్యం, అభివృద్ధిపై సమీక్షించిన జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

  మంచినీటి పైపులైన్ల లీకేజీలకు తక్షణమే  మరమ్మత్తు చేయాలని, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణం త్వరగా పూర్తిచేయాలని  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్  ప్రియాంకఅల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఐడీఓసీలో పారిశుద్ధ్య  కార్యక్రమాలు, ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తసేకరణ, గ్రామ పంచాయతీ భవనాల  నిర్మాణం, హరితహారం, ఉపాధిహామీపథక  పనులు, మంచినీటి సరఫరా, తదితరాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు.  లీకేజీల వల్ల మురుగునీరు చేరి మంచినీరు కలుషితమవుతుందని, తద్వారా వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున మరమ్మతులు చేపట్టాలని చెప్పారు. మంచినీటిట్యాంకులు  10 రోజులకొకసారి తప్పనిసరిగా పరిశుభ్రం చేయాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 286 పంచాయతీల భవనాలు మంజూరు కాగా,  వాటిలో 31చోట్ల పనులు ప్రారంభించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పంచాయతీ  భవనాల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీఓలు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల్లో ప్రగతి రావాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు,  ఎంపీడీఓలు ఇచ్చిన నివేదికల్లో వ్యత్యాసం ఉందని, తప్పుడు నివేదికలు అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారంలో అన్ని పనులు ప్రారంభం కావాలని, ఇంకా ప్రారంభం కాలేదంటూ కారణాలు చెప్పొద్దని హెచ్చరించారు. ఈసారి సమావేశంలోనైనా  భవనాల నిర్మాణానికి స్థలసమస్య ఉందని, ప్రారంభం కాలేదని చెప్పొద్దని ఆమె స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వారం రోజుల పాటు ప్రత్యేకంగా పారిశుద్ధ్య  కార్యక్రమాలు చేపట్టాలన్నారు. డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించి వాటిని  శుభ్రం చేయాలని ఆదేశించారు. మురుగు నీటినిల్వల వల్ల దోమల వ్యాప్తితో అంటు వ్యాధులు ప్రబలే అవకాశముందని, ప్రతి  మంగళ, శుక్రవారాల్లో ప్రతి ఇంటిలో డ్రైడే కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. డ్రైడే కార్యక్రమాలను సర్పంచ్, కార్యదర్శి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పర్యవేక్షణ  చేయాలని చెప్పారు. దోమల నిరోధం కోసం   ఫాగింగ్, మురుగునీరు నిల్వ ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్, గంభూషియా చేపలు కూడా   వేయాలని చెప్పారు. జ్వరాలు ప్రబలుతున్న  ప్రాంతాల్లో ఇంటింటి ఫీవర్ సర్వే చేపట్టడం తోపాటు, వైద్య శిబిరాలు నిర్వహించాలని,  ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఆమె  చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధి నిరోధక పరీక్షలు నిర్వహిస్తున్నామని, అస్వస్థతకుగురైనవారు తక్షణం వైద్యులను సంప్రదించి వైద్యసేవలు పొందాలని కలెక్టర్  సూచించారు. కొన్నిప్రాంతాల్లో ప్రజలు వైద్య సేవలకు ఆర్ఎంపీలను సంప్రదిస్తున్నారని, అలాకాక ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యసేవలు పొందాలని చెప్పారు. ఉపాధిహామీ పథకం పనులకు కూలీలను పెద్దఎత్తున మొబలైజ్ చేయాలని, ఈ పథకంలోనే పండ్ల మొక్కల పెంపకానికి అవకాశం ఉన్నందున రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. హారిత హారం లక్ష్యం మేరకు పూర్తిచేయాలన్నారు.  తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటుకు స్థల సమస్య ఉన్న మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు భూమి అందుబాటులో లేనట్లు ధృవీకరణ నివేదికలు అందజేయాలని ఆమె ఆదేశించారు. ఓటుహక్కు నమోదు గురించి   అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. ఈవీఎంల ద్వారా ఓటుహక్కు నమోదుపై జరుగుతున్న మాక్ పోలింగ్ ను  ఎంపీడీఓలు పర్యవేక్షణంచాలని చెప్పారు. జిల్లాలో 100 పాఠశాలలు, 70 కళాశాలల్లో ‘ఎలక్ట్రో లిటరసీ క్లబ్బులు’ ఏర్పాటు చేశామని, కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నమూనా ఓటింగ్ కార్యక్రమాలకు ఎంపీడీఓలు కస్టోడియన్ అధికారులుగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, డీపీఓ రమాకాంత్, జడ్పీ సీఈఓ విద్యాలత, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ రవిబాబు, మిషన్ భగీరథ (ఇంట్రా) ఈఈ నళిని, పంచాయతీరాజ్ ఈఈలు శ్రీనివాసరావు, మంగ్యా, ఎంపీడీఓలు, ఎంపీఓలు కూడా  పాల్గొన్నారు.

Related posts

‘చెవిలో పువ్వు… చేతిలో చిప్ప…’

Divitimedia

వైద్యఖర్చుల కోసం నేస్తం ట్రస్ట్ సాయం

Divitimedia

ఐటీడీఏలో సోమవారం ‘గిరిజనదర్బార్’ రద్దు : పీఓ

Divitimedia

Leave a Comment