ఏజెన్సీలో గిరిజనేతరులకు గృహలక్ష్మి వర్తింప చేయాలి
హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పాల్వంచ దుర్గ
✍🏽 దివిటీ మీడియా – మణుగూరు
గిరిజనులతో పాటు గిరిజనేతరులకు కూడా గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అసెంబ్లీ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న పాల్వంచ దుర్గ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె మద్దతుదారు, న్యాయవాది, సామాజిక కార్యకర్త కర్నె రవి వివరాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో పలు సంక్షేమ పథకాలకు దూరమవుతున్న లబ్దిదారులకు కూడా తక్షణమే రేషన్ కార్డులు మంజూరు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్ లో కోరినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పిటిషనర్ ఆ పూర్వాపరాలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏజెన్సీ పరిధిలోని పినపాక నియోజకవర్గంలో గిరిజనులు, గిరిజనేతరులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఎన్నో సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్న విషయం పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ అధికారులు 1970కి పూర్వం నుంచి ఉంటున్నట్లుగా ఆధారాలు ఉంటేనే గిరిజనేతరులు పథకాలకు అర్హులని చెప్తూ ఉన్నారని ఆమె తెలిపారు. గత సంవత్సరం గోదావరి వరదలతో పినపాక నియోజకవర్గ పరిధిలో గోదావరి నదీపరివాహక ప్రాంతం బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, తదితర మండలాల్లో గోదావరి వరదల వల్ల ఇల్లు కూలిపోయిన బాధితులు బిక్కుబిక్కుమంటూ శిథిలావస్థలో ఇంట్లోనే ఉంటున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ఈనాటి వరకు గిరిజనేతరులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించలేదన్నారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడం వల్ల పేదలు ప్రభుత్వ సంక్షేమపథకాల లబ్ధి పొందలేకపోతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె వివరించారు.