మూడు రోజుల్లో పింఛను దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశాలు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఆసరా పింఛన్ల దరఖాస్తుల విచారణ ప్రక్రియ మూడురోజుల్లో పూర్తి చేసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. ఐడిఓసి కార్యాలయం నుంచి శనివారం ఆసరా పింఛన్లు, గృహాలక్ష్మి కింద సాయంకోసం అందిన దరఖాస్తులపరిశీలన, ఆన్ లైన్ ప్రక్రియ, సోషల్ వెల్ఫేర్ ఇళ్లపట్టాల పంపిణీ విచారణ, జిఓ నెం.76, పోడుపట్టా పొందిన రైతులకు రైతుబంధు నిధుల మంజూరు, తదితర అంశాలపై జిల్లాకలెక్టర్ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. డీఆర్డీఓ, జడ్పీ, డీపీఓ, మున్సిపల్ కమిషనర్లు, అన్ని మండలాల తహసిల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో జరిగిన టెలికాన్ఫరెన్సులో కలెక్టర్ పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఆసరా పింఛన్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులపై విచారణ పూర్తిచేసి ఆన్ లైన్ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గృహలక్ష్మి పథకానికి 86,773 దరఖాస్తులు రాగా, ఆగస్టు 18వ తేదీ వరకు 62 వేల దరఖాస్తుల విచారణ ప్రక్రియ పూర్తి అయినట్లు చెప్పారు. మిగిలిన దరఖాస్తుల విచారణ ప్రక్రియ పూర్తిచేసి ధృవీకరణలతో నివేదికలు అందజేయాలని ఆదేశించారు. విచారణ ప్రక్రియలో రూపొందించిన అర్హుల జాబితాను ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలు పరిశీలించి ధృవీకరణ చేయాలని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ణీతమైన ప్రొఫార్మాలో వివరాల నమోదు తర్వాతనే పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ మండలాల్లో సోషల్ వెల్ఫేర్ ఇళ్లపట్టాలపై విచారణలు పెండింగ్ ఉన్నాయని, విచారణ అధికారులు 22వ తేదీలోగా విచారణ పూర్తి చేయాలని ఆదేశించారు. పోడు పట్టాలు పొందిన రైతులకు రైతుబంధు నిధులు మంజూరు కోసం ఆన్ లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్సులో జడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్, మున్సిపల్ కమిషనర్లు, అన్నిమండలాల తహసిల్దార్లు, ఎంపిడిఓ, ఎంపీఓలు, తదితరులు పాల్గొన్నారు.