Divitimedia
Bhadradri KothagudemCrime NewsSpot News

అతని కన్నుపడితే బంగారం మాయమేనా…

మూడు జిల్లాల్లో 20 చోరీల్లో నిందితుడి అరెస్టు

భారీగా చోరీ సొత్తు రికవరీ చేసిన పోలీసులు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో బంగారం చోరీలకు పాల్పడుతున్న ఓ ఘరానా నిందితుడిని భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో లక్ష్మీదేవి పల్లి ఎస్సై తమ సిబ్బందితో కలిసి ఇల్లందు క్రాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు చేశారు. ఆ సమయంలో పోలీసులను చూసి ఓ వ్యక్తి చేతిలో ఓ సంచి పట్టుకుని ఆటో నుంచి దిగి పారిపోతుండగా వెంబడించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు అతనిని ఫింగర్ ప్రింట్ డివైస్ ద్వారా తనిఖీ చేయగా అతను లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి గ్రామం నివాసి తంబల్ల నితిన్ అలియాస్ రాజు(26 సంవత్సరాలు) అని గుర్తించారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న అతని ఇంటికి వెళ్లి పోలీసులు సోదా చేసి, చోరీ సొత్తు అయిన కొన్ని బంగారు ఆభరణాలు రికవరీ చేశారని ఎస్పీ డాక్టర్ వినీత్ పేర్కొన్నారు. అరెస్టయిన నితిన్ మీద గతంలో సిద్దిపేట, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నమోదైన 13 కేసుల్లో జైలుకెళ్లి ఐదు నెలల క్రితం విడుదల అయ్యాడని, అతనిపై లక్ష్మీదేవి పల్లి పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా నమోదై ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఐదునెలల కాలంలో మళ్లీ అతనిపై 20 కేసులు నమోదయ్యాయి. రైల్వేలో 13 కేసులు, లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ లో 2 కేసులు, చుంచుపల్లి పోలీస్ స్టేషన్ లో 3 కేసులు, సుజాతనగర్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులు నమోదైనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు గుర్తించారు. తాను తాళం వేసి ఉన్న ఇళ్లలో, రైళ్లలోను దొంగతనాలు, చైన్ స్నాచింగులకు పాల్పడుతుంటానని నిందితుడు అంగీకరించాడని వెల్లడించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ రూట్లో తిరిగే రైళ్లలో రాత్రి సమయాల్లో ఎక్కి ప్రయాణికులు నిద్రించిన తర్వాత బ్యాగులు దొంగిలించి, వాటిలోని బంగారు, వెండి ఆభరణాలు అపహరించే వాడని ఎస్పీ డాక్టర్ వినీత్ వివరించారు. దీంతోపాటు కొత్తగూడెం పరిసరప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లు రెక్కీ చేసి చోరీలకు పాల్పడుతూ, చోరీసొత్తు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలలో తాకట్టు పెట్టి విలాసవంతమైన జీవితం గడిపేందుకు అలవాటుపడినాడని వెల్లడించారు. పట్టుబడిన ఈ నిందితుడు నితిన్ వద్దనుంచి రైల్వేకేసుల్లో చోరీకి గురైన 23.7 తులాల బంగారం (విలువ దాదాపు రూ14.22 లక్షలు) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేసులకు సంబంధించి 9.6తులాల బంగారు ఆభరణాలు (విలువ దాదాపు రూ.5.76 లక్షలు), 187 తులాల వెండి ఆభరణాలు (విలువ దాదాపు రూ.1.40లక్షలు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఆభరణాలతోపాటు ఇంకా తాకట్టులో ఉన్న చోరీసొత్తు దాదాపు 11.75 తులాల బంగారం(విలువ దాదాపు రూ.7.05లక్షలు) రికవరీ చేయాల్సి ఉన్నదని వివరించారు. నితిన్ అలియాస్ రాజు చోరీ చేసిన మొత్తం సొత్తు విలువ రూ.28.43లక్షలుగా అంచనా వేస్తున్నారు. అతనిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. నితిన్ అలియాస్ రాజు అనే నిందితున్ని పట్టుకుని విచారించి, కేసులను ఛేదించిన ఎస్సైలు ప్రవీణ్, సుమన్, సంతోష్, రాజమౌళి, హెడ్ కానిస్టేబుళ్లు రమణ, రఘురామిరెడ్డిలను ఈ సందర్భంగా ఎస్పీ అభినందించారు.

Related posts

జిల్లాలో ఓటరు జాబితాలో సవరణలకు 6,418 దరఖాస్తులు

Divitimedia

భార్యపై కోపంతో 8ఏళ్ల కన్నకూతురిని చంపిన కసాయి తండ్రి

Divitimedia

లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులు పంపిణీ చేసిన ఎస్పీ

Divitimedia

Leave a Comment