సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
సమీక్షలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
✍️ దివిటీ మీడియా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధానలక్ష్యమని భారీ నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్రానికి గోదావరి, కృష్ణ నదుల నుంచి రావలసిన ప్రతి నీటిబొట్టును కాపాడుకుంటామని ఆయనన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన 4వ పంప్ హౌస్ పనుల పురోగతిని, మొత్తం ప్రాజెక్టు పనుల స్థితిగతులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి శుక్రవారం భారీ నీటిపారుదలశాఖ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలను మంత్రులకు వివరించారు.
అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించామని తెలిపారు. గోదావరి నదిలో తెలంగాణ రాష్ట్రానికి మొత్తం 968 టీఎంసీల నీటి వాటా కేటాయించబడిందని, నీటి లభ్యత 75 శాతం దాటిన తర్వాత సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు లభించాయని చెప్పారు. తాగునీటి అవసరాలు కూడా ప్రత్యేకంగా లెక్కగట్టి ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో పూర్తయ్యే అవకాశమున్న సాగునీటి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల రాష్ట్ర రైతాంగానికి తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. ప్రస్తుత తమ కాంగ్రెస్ ప్రభుత్వం రూ.19,324 కోట్ల వ్యయంతో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి చర్యలు చేపట్టిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మంజిల్లాలో సుమారు 6 లక్షల 74 వేల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందించనున్నట్లు తెలిపారు. భూసేకరణ ప్రధాన లక్ష్యంగా తీసుకుని వచ్చే ఆరు నెలల్లో భూసేకరణ కోసం రూ.5,000 కోట్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. భూసేకరణ పూర్తయిన వెంటనే రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా పరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మార్గదర్శకత్వంలో గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణకు రావలసిన నీటివాటా పరిరక్షణకోసం అన్నిస్థాయిల్లో సమర్థవంతమైన పోరాటం కొనసాగుతోందన్నారు. కృష్ణా వాటర్ ట్రిబ్యునల్, కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు సహా అన్ని వేదికలపై తెలంగాణకు రావలసిన ఒక్కచుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు.
పోలవరం–నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు నష్టం కలిగించే ఏ అంశాన్నీ అంగీకరించబోమని, ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత బోర్డులకు, సుప్రీంకోర్టుకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను తెలియజేశామని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు, ఈ రాష్ట్రానికి రావలసిన ప్రతి నీటిబొట్టు కాపాడుకునే వరకు ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, మొదటి ప్రాధాన్యంగా పినపాక, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ పనులు పూర్తి చేస్తే, ఈ ఏడాదిలోనే కొన్ని ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిన విధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మాణానికి సుమారు రూ.4,000 కోట్ల రివైజ్డ్ అంచనాలకు అనుమతి లభించి టెండర్లు, బిల్లుల ప్రక్రియలు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. గతంలో కేవలం మెయిన్ కెనాల్‌కే అనుమతులు ఉండటంతో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఈ ప్రాజెక్టులో భాగంగా లేవని గుర్తుచేశారు. మంత్రుల స్థాయిలో నిరంతరం ఒత్తిడి తీసుకురావడం వల్ల మొదటి మూడు పంప్ హౌసులు ప్రారంభానికి రావడంతో పాటు, 18 లింక్ కెనాళ్లు, రాజీవ్ కెనాల్ ద్వారా వైరా ప్రాజెక్టుకు నీళ్లు అందించే స్థాయికి పనులు చేరుకున్నాయన్నారు. దీని ద్వారా ఇప్పటికే కొంత స్థిరీకరణతో సాగునీరందించే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈఏడాది జూన్, జులై నాటికి సత్తుపల్లి ట్రంక్ పనులు పూర్తిచేసి ఈ మండలాలకు నీళ్లందించాలన్న లక్ష్యంతో అధికారులు పనిచేయాలని తుమ్మల సూచించారు. వచ్చే ఏడాదికి నాలుగవ పంప్ హౌస్‌తో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కూడా పూర్తిచేయాలన్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి ట్రంక్, నాలుగవ పంప్ హౌస్ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ను కోరారు. జూలూరుపాడు వద్ద పనులు పూర్తిచేసి పాలేరు నియోజకవర్గానికి లింక్ కెనాల్ ద్వారా నీరందించేందుకు చర్యలు తీసుకోవాలని, ఎన్టీఆర్ కెనాల్ లింక్ కెనాల్ పనులు పూర్తైతే సత్తుపల్లి నియోజకవర్గానికి పూర్తిస్థాయిలో సాగు నీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్టు పనుల సందర్భంగా రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే మంత్రులు, జిల్లా కలెక్టర్‌తో సమన్వయం చేసుకుని భూసేకరణ సమస్యలు లేకుండా పరిష్కరించాలని ఎమ్మెల్యేలను కోరారు. సీఎం రేవంత్ రెడ్డి, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి ఆలస్యం లేకుండా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు నిచ్చారు. పని వత్తిళ్లు ఉన్నప్పటికీ సీతారామ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధతో ఈ సమీక్ష సమావేశానికి హాజరైన భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యేలు, జిల్లాప్రజలు, రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమీక్షలో అశ్వారావుపేట, సత్తుపల్లి ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, మట్టా రాగమయి, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, అటవీశాఖ జిల్లా అధికారి కృష్ణగౌడ్‌తోపాటు భారీ నీటి పారుదలశాఖ, వ్యవసాయశాఖలకు చెందిన అధికారులు, కాంట్రాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

