రైతు అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
వరి ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్
వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయ పథకాలు ప్రారంభించిన మంత్రులు
✍️ దివిటీ మీడియా
రైతు అభ్యున్నతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని,రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చేయూతతో ధాన్యం ఉత్పత్తులలో తెలంగాణ దేశంలోనే ‘నెంబర్ వన్’ గా నిలిచిందని ర్రాష్ట
వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం, ప్రకృతి (సహజ) వ్యవసాయ. విధానాల అమలు పథకాలను మంత్రులు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రైతుమేళా, టీజీ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూసార పరీక్ష–ఆయిల్‌పామ్ పత్రాల సమగ్ర పరిశీలనా ప్రయోగశాల, నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమాల ప్రదర్శనలను మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ కళాశాలలో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు, రూ.5 కోట్లతో బాలికల వసతి గృహ నిర్మాణం, రూ.3 కోట్లతో 3 కిలోమీటర్ల బీటీ. రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వ్యవసాయ యంత్ర పరికరాలు, ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ సామగ్రితో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను కూడా మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 35 సంవత్సరాల క్రితం స్థాపించిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల దేశ విదేశాల్లో నిపుణులను తయారు చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థగా ఎదిగిందన్నారు. ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రూ.8 కోట్లు మంజూరు చేయడం సంతోషమన్నారు. అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ కళాశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏ పంటనైనా పండించే సామర్థ్యం ఉన్న రైతులున్నారని, ఆయిల్‌పామ్ సాగులో కోకో, మిరియాలు, జాజి వంటి అంతర పంటలు కూడా విజయవంతంగా సాగు చేస్తున్నారని ప్రశంసించారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ జిల్లాలో గోదావరి జలాలతో అధిక ఆదాయమిచ్చే ఆధునిక పంటలు సాగుచేసి తెలంగాణకేకాకుండా దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు. వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. చిన్న, సన్నకారు, గిరిజన, వెనుకబడిన వర్గాల రైతుల అభివృద్ధికోసం 50శాతం సబ్సిడీ తో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. 2047 నాటికి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 400 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి వ్యవసాయం రైతులకు అత్యంత ఉపయోగకరమైన పథకాలన్నారు. గతంలో నిలిచిపోయిన వ్యవసాయ యాంత్రీకరణ పథకాలను పునఃప్రారంభించి 50 శాతం సబ్సిడీతో రైతులకు యంత్రపరికరాలు అందించడం శుభపరిణామమన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.31లక్షల మంది రైతులకు రూ.101 కోట్ల వ్యయంతో వ్యవసాయ పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రసాయనిక ఎరువుల అధిక వినియోగం కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో నాచురల్, ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ సీజన్‌లో 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో పాటు బోనస్ కూడా అంద జేస్తున్నామన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, గుమ్మడవెల్లి ప్రాజెక్టు రింగ్‌బండ్ నిర్మాణానికి రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ముడి పడి ఉన్నందున ఆధునీకరణకు చర్యలు చేపట్టాలని కోరారు. అశ్వారావుపేటలో అంకమ్మ చెరువు నుంచి లోతువాగు – దెబ్బతోగు ద్వారా గుమ్మడవెల్లి ప్రాజెక్టు కు నీరు చేరే అవకాశం ఉందని, ఇందుకు సంబంధించిన భూ సేకరణ కొంతవరకు పూర్తయి, పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పూర్తి చేయాలని మంత్రులను కోరారు. 7,675 ఎకరాలకు సాగునీరందించే
మూకమామిడి ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని నీటిపారుదల శాఖ మంత్రిని కోరారు. కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ,
జిల్లాలో వ్యవసాయ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం, బయోచార్ తయారీ వంటి అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామన్నారు. యువ రైతులు ఆధునిక సాంకేతిక వ్యవసాయంలోకి రావాలని, యాంత్రీకరణను సమర్థవంతంగా వినియోగించుకుని రైతులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉందన్నారు. సమీకృత వ్యవసాయ విధానాలతో బూర్గంపాడు మండలం మొరంపల్లిబంజర గ్రామంలో మహిళలు సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు సాధిస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పీజేటీఎస్ ఏయూ, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీలు జానయ్య, రాజిరెడ్డి, టీజీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, రాష్ట్ర సంచాలకులు గోపి, ఉద్యానశాఖ రాష్ట్ర సంచాలకులు, టీజీ ఆయిల్ ఫెడ్ ఎండీ ఎండీ యాస్మిన్ బాషా, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, సంబంధిత శాఖల అధికారులు టీజీ ఆయిల్ బోర్డ్ సభ్యుడు ఆలపాటి రామచంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

