ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం ఓ చారిత్రాత్మక ఘట్టం

దేశం గర్వించదగ్గ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించబోతున్నాం

డిసెంబర్ 2న ప్రారంభోత్సవం అనంతరం సీఎం బహిరంగసభ
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి తుమ్మల
✍️ దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (నవంబరు 23)
ఉమ్మడి ఖమ్మంజిల్లాలో తొలి విశ్వ విద్యాలయంగా అభివృద్ధి చెందుతున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం జిల్లాకు ఒక చారిత్రాత్మక ఘట్టమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటన, యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ఆదివారం మంత్రి తుమ్మల, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ తదితరులతో కలిసి పరిశీలించారు. వేదిక, శిలాఫలకం, అతిథుల వసతి, మీడియా సెంటర్, పార్కింగ్, రాకపోకలు వంటి అంశాలను పరిశీలించిన మంత్రి, ప్రతిపాదిత ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటనలో భద్రతా వ్యవస్థలో ఏ లోపం లేకుండా అన్ని శాఖలు, పోలీసు విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నిర్వహించిన సమీక్షా సమావేశంలో అన్ని విభాగాలు చేపట్టాల్సిన బాధ్యతలను శాఖలవారీగా మంత్రి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, దేశంలో ఇప్పటివరకు లేని ప్రత్యేక సబ్జెక్టులతో ఈ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని తెలంగాణ ప్రభుత్వం స్థాపిస్తున్నదని పేర్కొన్నారు. గతంలో సింగరేణి సంస్థ నిర్వహించిన స్కూల్ ఆఫ్ మైన్స్ ను గుర్తుచేస్తూ, 1996లో జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల అవసరాన్ని గుర్తించి అధికారిక గుర్తింపు కోసం కృషిచేసిన విషయం వివరించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఏ ఒక్క విశ్వ విద్యాలయం లేదనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఇతర విశ్వవిద్యాలయాలకు భిన్నమైన భూగోళ శాస్త్రాలు, సహజ వనరులు, ఖనిజపరిశోధనలకు ఉపయోగపడుతూ దేశ భవిష్యత్తుకు దోహదం చేసే ప్రత్యేక విశ్వవిద్యాలయం ఇక్కడ అవసరమని భావించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ సూచనలతో రూపొందించిన ప్రతిపాదనను ప్రభుత్వం నిపుణులతో కలిసి ఆరు నెలలపాటు పరిశీలించి, సాధ్యతా నివేదిక ఆధారంగా అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించిందని మంత్రి వివరించారు. ‘ఖనిజ సంపదలకు పుట్టినిల్లు’గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అరుదైన ఖనిజాల లభ్యతతో ఎర్త్ సైన్స్ యూనివర్శిటీ స్థాపనకు అత్యుత్తమ ప్రదేశంగా ఎంపికైందని తెలిపారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భవిష్యత్ తరాల విద్యకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కట్టుబాటుతో యూనివర్సిటీ అభివృద్ధి చేపడుతున్నట్లు తెలిపారు. దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడైన, దేశానికి పదేళ్లు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టాలని నిర్ణయిస్తే, మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. 300 ఎకరాల విస్తీర్ణంలో, జాతీయ రహదారి పక్కనే అభివృద్ధి చెందుతున్న ఈ యూనివర్సిటీ భవిష్యత్తులో ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థగా నిలవనున్నదని చెప్పారు. ప్రజా పాలన చేపట్టి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు ఖరారు చేసినట్టు ఆయన వివరించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 2న జిల్లాకు యూనివర్సిటీ ప్రారంభానికి సీఎం రానున్నారని, ప్రారంభోత్సవం అనంతరం బహిరంగసభ ఉంటుందని వివరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ కె.సుజాత, పాల్వంచ డీఎస్పీ కె.సతీష్ కుమార్, మండల అధికారులు పాల్గొన్నారు.

