గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కోర్టు తీర్పు తర్వాత మండల, జిల్లా పరిషత్తుల ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం
✍️ దివిటీ – హైదరాబాద్(17 నవంబరు)
స్థానికసంస్థలకు సంబంధించి ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
@ స్థానికసంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గతంలో మంత్రిమండలి తీర్మానం చేసి, అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉండటం, కొందరు హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించడం, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడం వంటి పరిణామాలపై మంత్రివర్గం సమగ్రంగా చర్చించింది. ఎన్నికలు నిర్వహించని పక్షంలో 15వ ఆర్థికసంఘం నుంచి రాష్ట్రానికి రావలసిన దాదాపు రూ.3వేల కోట్లు నిలిచిపోయే ప్రమాదమేర్పడుతున్న నేపథ్యంలో కోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకుని మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం తీర్మానించింది.
@ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో శతవిధాలా ప్రయత్నించిందని, ఈ అంశంపై న్యాయస్థానాల్లో పోరాటం కొనసాగించాలని నిర్ణయించింది.
@ ముందుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి, న్యాయస్థానాల్లో ఈ విషయం తేలిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు పార్టీ పరంగా 42 శాతం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.
@ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫోర్త్ సిటీలో నిర్వహించాలని, డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించింది.
@ ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీ సేవలను స్మరిస్తూ మంత్రి మండలి తీవ్రసంతాపం తెలియజేసింది. రాష్ట్ర ప్రజలకు వారందించిన ‘జయ జయహే తెలంగాణ..’ రాష్ట్ర గీతాన్ని పాఠ్యపుస్తకాల్లో మొదటిపేజీలో ప్రచురించాలని కేబినేట్ తీర్మానించింది.
అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా ఉద్యోగం ఇవ్వాలని, అందెశ్రీ అంత్యక్రియలు జరిగిన ప్రదేశాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దాలని తీర్మానించింది.
@ గిగ్ వర్కర్ల ప్రయోజనాల కోసం రూపొందించిన బిల్లుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసినట్టు మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టి దీనికి చట్టరూపం కల్పిస్తామన్నారు.
@ ప్రజల అభ్యర్థన మేరకు ఎస్ఆర్ఎస్పీ మెయిన్ కెనాల్ కు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరును పెట్టాలని మంత్రిమండలి తీర్మానించింది.

