నవ్విపోదురుగాక… మాకేంటి…?
కలెక్టరేట్ లో మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యమా…?

✍️ దివిటీ (భద్రాద్రి కొత్తగూడెం) ఆగస్టు 31
అధికారిక పత్రాల్లో తప్పులు చేయడం కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో పనిచేస్తున్న అధికారులకు అలవాటు గా మారినట్లుంది… పదిరోజుల క్రితం చేసిన తప్పునే మళ్లీ మరోసారి చేశారు. అందులోనూ చేసిన తప్పులే పదే పదే చేయడం వారి పనితీరుకు పరాకాష్ఠగా మారింది. ‘రాష్ట్ర ప్రభుత్వ బాస్’ అయిన ఛీఫ్ సెక్రటరీకి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ నుంచి అందించే సమాచారంలోనే మరోసారి అదే తప్పు చేయడం విశేషం… పదిరోజుల క్రితం చేసిందే హాస్యాస్పదం అనుకుంటే తాజాగా రెండోసారి కూడా ఈరోజు (ఆగస్టు 31) మళ్లీ గోదావరినది వరద సమాచారంలోనే తప్పులుండటం పట్ల ఏవిధంగా చూడాలో వారే చెప్పాలి.
సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ పేరుతో ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పంపించిన “ఫ్యాక్స్ మెసేజ్” మరోసారి హాస్యాస్పదమైంది. ఆగస్టు 22న పంపిన ఇదే గోదావరి వరద సమాచారపత్రంలో చేసిన తప్పులే మళ్లీ చేశారు. ఆ తప్పుల తడక పత్రాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) నుంచి ఆదివారం విడుదల చేశారు. ఆ పత్రంలో సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తప్పుగా సమాచారం ఎలా పంపిస్తారనేది మరోసారి తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. గతంలోనే ఆగస్టు 22న చేసిన తప్పులు ‘దివిటీ మీడియా’ ఎత్తిచూపడంతో సంబంధిత సిబ్బందిపై, అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి మందలించినప్పటికీ ఏమాత్రం మార్పు రాలేదనేందుకు తాజా ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. తాజానిర్వాకంపై జిల్లాకలెక్టర్, బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి మరి…!.