కలెక్టర్ ఇచ్చిన సమాచారమే… కరెక్ట్ కాదా…?
కలెక్టరేట్ లోనే ఇంత నిర్లక్ష్యమా…?
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 22)
“కామా ఓ ప్రాణం తీసింది” అనేది నానుడి… అధికారిక పత్రాల్లో రాతలకు అంతటి శక్తి ఉంటుంది మరి… అందులో కూడా జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే ఆర్డర్, సమాచారం ఏదైనా మరింత శక్తివంతం..
జిల్లాలో ఏ అధికారిక సమాచారమైనా తప్పు కావచ్చేమో గానీ, సాక్షాత్తూ ‘జిల్లా బాస్’ అయిన జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఏ సమాచారమైనా తప్పులుండవనేది జిల్లా ప్రజల నమ్మకం… జిల్లా పరిపాలనలో అతిపెద్ద పాత్ర పోషిస్తున్న జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే సమాచారంలోనే తప్పులు దొర్లితే… అందులోనూ ‘రాష్ట్ర ప్రభుత్వ బాస్’ అయిన ఛీఫ్ సెక్రటరీకి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి కలెక్టర్ నుంచి అందించే సమాచారంలోనే నిర్లక్ష్యం కనిపిస్తుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో కదా?.
సరిగ్గా ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది…
భద్రాచలం వద్ద గోదావరి వరదలకు సంబంధించిన సమాచారం జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి పంపించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ పేరుతో ఓ పత్రాన్ని జిల్లా పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) నుంచి శుక్రవారం విడుదల చేశారు. ఆ పత్రంలో ఉన్న తప్పులు చూస్తే సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేరుగా కలెక్టర్ పేషీలోనే ఇంత నిర్లక్ష్యం నెలకొన్నదా? అని ఆశ్చర్యం కలుగుతోంది. ఫ్యాక్స్ మెసేజ్ పంపినట్లుగా పేర్కొన్న పత్రంలో పైభాగంలో “గోదావరి వరదలు-2025″కు బదులుగా “గోదావరి వరదలు -2024” తెలియజేశారు. దాంతోపాటు అత్యంత కీలకమైన ‘ఆర్.సి.నెంబర్’లో కూడా అదే విధంగా “2025” కు బదులుగా “2024” అంటూ పేర్కొన్నారు. అంటే అధికారులు గత ఏడాది వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వానికిచ్చిన సమాచారం పత్రాన్నే కొన్ని మార్పులు చేసి తాజాగా పంపారని అర్థమవుతోంది. కనీసం మార్పులు చేసే విషయంలో కూడా ఇంతటి నిర్లక్ష్యమా? అనే బాధ కలుగుతోంది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే పరిస్థితులు ఇలా ఉంటే కిందిస్థాయిలో ఇంకెంత ఘోరంగా ఉందోననే అనుమానాలు కలుగుతున్న పరిస్థితి. ఈ వ్యవహారంపై జిల్లాకలెక్టర్ విచారణ జరిపించి, తప్పులకు బాధ్యులైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.