విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
కూలిన చెరువుసింగారం పాఠశాల గోడ
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 19)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని మారుమూల గిరిజన గ్రామం చెరువుసింగారంలో చిన్నారులకు ప్రమాదం తప్పింది. ఈ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం గోడ ఓవైపు సోమవారం రాత్రి కూలిపోయింది. పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఈ భవనం గోడలు నీటికి నానిపోయాయి. ఒకవైపు గోడ కూలడంతోపాటు భవనం స్లాబ్ కూడా శిథిలావస్థలో ఉంది. ఈ గోడ కూలిన సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని మంగళవారం ఆ గ్రామం సందర్శించిన
సీపీఎం బూర్గంపాడు మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లుకు చెరువుసింగారం గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులకు చాలాప్రమాదం తప్పిందని, గతంలో ఈ సమస్య అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లామని వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఐటీడీఏపీఓ, ఐటీసీ మేనేజ్మెంట్, కలెక్టర్ చొరవ చూపి
ఈ పాఠశాల సమస్య పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆ స్కూలుకు కొత్త భవనం నిర్మించాలని, లేని యెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు, పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. మారుమూల చెరువుసింగారం గ్రామాన్ని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ గ్రామ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని కోరారు. ఆ గ్రామానికి రోడ్డు సక్రమంగా లేదని, మట్టిరోడ్డు బురదతో టీచర్లు, అంగన్వాడీ టీచర్లు ఆ గ్రామం పోవాలంటే చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గ్రామ ప్రాథమిక పాఠశాల భవనం వెంటనే నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సర్ప సత్యనారాయణ, ఈసం సురేష్, సర్ప రాజు, సోయం వీరస్వామి, సున్ను లక్ష్మయ్య, సర్ప రాజురత్నం, మడకం ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.