హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
✍️ బూర్గంపాడు – దివిటీ (ఆగస్టు 18)
అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన కడియం సర్వేశ్వరరావును గాయపరిచి చంపిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పాల్వంచ ఇన్ఛార్జ్(అశ్వారావుపేట) సీఐ నాగరాజు, బూర్గంపాడు ఎస్సైలు మేడ ప్రసాద్, దేవ్ సింగ్ లతో కలిసి నిందితుల వివరాలు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం… టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన చర్లపల్లి శివ ఇంటిదగ్గర నుంచి గ్యాస్ సిలిండర్ అనుమతి లేకుండా తెచ్చాడనే కారణంతో అతనితోపాటు అదే గ్రామానికి చెందిన కొండల సంతోష్ కలిసి ఆగస్టు 11వ తేదీ అర్థరాత్రి సుమారు 12గంటల సమయంలో మోతె గ్రామంలో ఎస్కే జావేద్ ఇంటి ముందు సర్వేశ్వరరావుపై దాడి చేశారు. ఆ గొడవలో కొండల సంతోష్, చర్లపల్లి శివ ఇద్దరూ కలిసి సిమెంటు డంబెల్ తో సర్వేశ్వరరావు తలపై కొట్టారు. తీవ్రంగా గాయపడిన సర్వేశ్వరరావు, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆగస్టు16వ తేదీ ఉదయం మరణించాడు. మృతుని తల్లి రమణమ్మ ఫిర్యాదు మేరకు బూర్గంపాడు ఎస్సై మేడ ప్రసాద్ కేసు నమోదు చేయగా, ఇన్ఛార్జ్ సీఐ నాగరాజు దర్యాప్తు చేపట్టి, నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.