లక్షమందితో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవం
బెండాలంపాడులో సీఎం రేవంత్ రెడ్డితో 27ఇళ్ల గృహప్రవేశాలు
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలనలో మంత్రి పొంగులేటి
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 18)
లక్షమందితో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ మహోత్సవాన్ని రాష్ట్రంలో తొలిసారిగా ఘనంగా నిర్వహించనున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలంపాడు గ్రామంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు హాజరు కానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, మట్టా రాగమయితో పాటు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో గడిచిన పదేళ్ల కాలంలో పేదలకు ఇంటి కల కలగానే మిగిలిపోయిందన్నారు. సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకనుగుణంగా ఇందిరమ్మ పథకం పునఃప్రారంభించి, మొదటి విడతగా రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల మంజూరుతో పేదోడి చిరకాలవాంఛను ఈ పేదోడి ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. ఈ శ్రావణ మాసంలో 21వ తేదీ శుభ ముహూర్తంలో సీఎం స్వయంగా బెండలంపాడులో గృహ ప్రవేశాల్లో పాల్గొనబోతున్నారని ఆయన తెలిపారు. ఈ గ్రామంలో మొత్తం 312 ఇళ్లు మంజూరవగా, వాటిలో 72 ఇళ్లు పూర్తయ్యాయని, అందులో 27 ఇళ్లకు ముఖ్యమంత్రి చేతుల మీదగా గృహ ప్రవేశం జరగనుందని వివరించారు. ఈ ప్రభుత్వం పార్టీలకు, కులమతాలకు అతీతంగా అర్హులందరికీ అందజేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.22,500 కోట్ల వ్యయం తో మంజూరు చేసిన 4.5 లక్షల ఇళ్లలో దాదాపు 2.5 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మిగిలిన ఇళ్లు కూడా ఇందిరమ్మకమిటీల ద్వారా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి మంజూరు పత్రాలు అందజేశామని మంత్రి వెల్లడించారు. భద్రాద్రి రాముని సన్నిధిలో గతంలో ప్రారంభించిన ఈ పథకంలో నేడు అదే భద్రాద్రి నేలపై సీఎం చేతుల మీదుగా గృహప్రవేశం జరగడం చారిత్రక ఘట్టమని తెలిపారు. అందరూ కార్యక్రమం విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానన్నారు. అధికారులు చిన్న తప్పిదాలు కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పేదవాడి కల నిజం చేసే ఈ గృహప్రవేశ ఉత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 21వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు చంద్రుగొండ, 2-10 గంటలకు బెండలంపాడు చేరుకుని 2-20గంటలకు లబ్ధిదారుల ఇళ్లలో ముఖ్యమంత్రి పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారని వెల్లడించారు. ఒక్కో ఇంటి వద్ద సీఎం15 నిమిషాలపాటు లబ్ధిదారులతో మాట్లాడే కార్యక్రమం ఉంటుందన్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి సీఎం ప్రజాసభలో పాల్గొని ప్రసంగిస్తారని వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ సమన్వయంతో స్థానికసంస్థల అదనపు కలెక్టర్ కార్యక్రమం ఏర్పాట్ల పర్యవేక్షణ చేస్తారని జిల్లాకలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు, వీఐపీల ప్రోటోకాల్, ప్రజల రాకపోకలనియంత్రణ, తదితర అంశాలపై జిల్లా ఎస్పీ వివరాలు తెలియజేశారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ, మారుమూల గిరిజన ప్రాంతంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా గృహప్రవేశాల్లో భాగస్వాములు కావడం గిరిజనుల పట్ల ప్రభుత్వ కట్టుబాటుకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికారులందరూ తమ విధుల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం గిరిజన జీవన ప్రమాణాలను మెరుగుపర్చేదిశలో ఓ చారిత్రక మైలురాయిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలతో కలిసి హెలిపాడ్, సభా ప్రాంగణం, ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ చైర్మన్ విజయ్ బాబు, జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, జిల్లా స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్డీఓ మధు, అన్ని శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.