Divitimedia
Bhadradri KothagudemCrime NewsHealthLife StyleNational NewsSpot NewsTelanganaYouth

పోలీసుశాఖ ఆధ్వర్యంలో పూసగుప్పలో ఆసుపత్రి, అంబులెన్స్

సరిహద్దు గ్రామంలో చక్కనైన సదుపాయం

పోలీసుశాఖ ఆధ్వర్యంలో పూసగుప్పలో ఆసుపత్రి, అంబులెన్స్

రూ.1కోటి వ్యయంతో ఏర్పాటుచేసిన వైద్యసదుపాయాలు ప్రారంభం

✍️ చర్ల, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (జులై 11)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామం పూసుగుప్పలో పోలీసుశాఖ రూ. కోటి వ్యయంతో ఏర్పాటుచేసిన మొబైల్ హాస్పిటల్, అంబులెన్స్ సేవలు పరిసర గ్రామాల ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ వైద్యసదుపాయాలను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో పాటు, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు సమక్షంలో శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ (స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్) నిధుల ద్వారా విడుదలైన కోటి రూపాయల వ్యయంతో ఈ మొబైల్ హాస్పటల్ నిర్మించారు. చర్ల మండలం పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం కోసం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారథ్యంలో పోలీసుశాఖ విశేషసేవలు అందిస్తోందని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సందర్భంగా ప్రశంసించారు. పూసుగుప్ప పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా అత్యవసర చికిత్స అవసరమైతే భద్రాచలం,కొత్తగూడెం పట్టణాలకి వెళ్లడానికి ఒకప్పుడు సరైన రహదారి కూడా లేదన్నారు. ఇప్పుడు ఇదే పూసుగుప్ప గ్రామానికి చర్ల నుంచి అరగంట వ్యవధిలోనే చేరుకునే విధంగా రహదారి నిర్మించడం, ఇప్పుడు ఈ హాస్పిటల్ ప్రారంభించడంలో చర్ల పోలీసుల కృషి ఎంతగానో ఉందన్నారు. ఆదివాసీ ప్రజల సంక్షేమంకోసం ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి సేవలను పరిసర ప్రాంతాల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున అందాల్సిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ఆదివాసీ ప్రజలకు అందజేయడంలో జిల్లా పోలీసుల కృషి అభినందనీయమన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు విద్య, వైద్యం, రవాణా వంటి కనీస సౌకర్యాలనందించడమే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున పోలీసుశాఖ, ఏజెన్సీ ప్రాంతవాసులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎలాంటి సమస్యలున్నా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించడంలో స్థానిక పోలీసు అధికారులు ఎల్లప్పుడూ ఆదివాసీలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతిఒక్కరూ తమ తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్రంలో గ్రామాలైన రాంపురం, భీమారం గ్రామాల ప్రజలు కూడా పూసుగుప్ప ఆసుపత్రి సేవలను వినియోగించుకోవాలని ఈ సందర్బంగా ఎస్పీ సూచించారు. అనంతరం ఆయన అంబులెన్స్ సేవలు ప్రారంభించారు. ఇటీవల పూసుగుప్ప నుంచి రాష్ట్రం సరిహద్దు వరకు నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, చర్ల ఇన్స్పెక్టర్ రాజువర్మ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ చెన్నూరి శ్రీనివాస్, ఇ.శ్రీనివాస్, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇంజినీరింగ్ పనులన్నీ ఏప్రిల్ 10లోగా పూర్తి చేయకపోతే చర్యలు

Divitimedia

Divitimedia

MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల..

Divitimedia

Leave a Comment