సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలుపరచాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఏప్రిల్ 26)
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు పరచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన, భూభారతి చట్టం, జలసంచయ్ జన్ భాగిదారి ఇంకుడు గుంతలు, పారమ్ పాండ్స్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారంపై జిల్లాలోని అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిశీలన వేగవంతం చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లకు గాను ఇప్పటికే మొదటి విడతలో ప్రతి మండలానికి ఒక గ్రామపంచాయతీ ఎంపిక చేసినందున మిగిలిన గ్రామ పంచాయతీలలో లబ్ధిదారుల జాబితా క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారులు తమ వద్దకు వచ్చిన జాబితాను సంబంధిత మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందజేసి, వారు స్థానికంగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, పంచాయతీ సెక్రటరీలతో సమన్వయం చేసుకుని జాబితాలోని పేదల్లో నిరుపేద వారిని గుర్తించి అర్హులుగా జాబితా రూపొందించాలన్నారు. జాబితాలో పేరు లేని ఎవరైనా నిరుపేదలుంటే వారి పేర్లు కూడా చేర్చి, స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో అర్హుల జాబితా రూపొందించాలన్నారు. జిల్లావ్యాప్తంగా రాజీవ్ యువవికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులన్నీ త్వరితగతిన పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన దరఖాస్తులు కార్పొరేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో బ్యాంకర్లతో కలిసి పరిశీలించి, అర్హుల జాబితా రూపొందించాలన్నారు. రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకున్న వారికి వ్యవసాయాధారిత యూనిట్లు స్థాపించే విధంగా అవగాహన కల్పించాలన్నారు. భూమి ఉన్నవారికి ఆయిల్ పంపు, పందుల పెంపకం, పాడి పరిశ్రమ, పవర్ లోడర్ వంటివి, భూమి లేనివారికి చేపల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, పిండి మిల్లు వంటి యూనిట్లు స్థాపించడం ద్వారా వారికి లాభదాయకంగా ఉంటుందని తెలియచెప్పాలన్నారు. జల్ సంచయ్ జన్ భాగీధారి కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా విస్తృతంగా ఇంకుడు గుంతలు, ఫారమ్ పౌండ్స్ నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేపట్టిన నిర్మాణాలను ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూభారతి జిల్లాలో అమలులో భాగంగా రెవెన్యూ రికార్డులు సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. నాన్ డీఎస్ కారణాలు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా పెండింగ్ భూ సమస్యల దరఖాస్తులపై నివేదిక అందించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు తమ పరిధిలోని రేషన్ కార్డు దరఖాస్తులు, ఎన్నికల దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను జిల్లాకలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు. పైప్ లైన్లలో లీకేజీలు, పంపుల మరమ్మత్తులు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఇబ్బందులున్నచోట ట్యాంకర్లతో మంచి నీరు సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ త్రాగునీటి సమస్య తలెత్తినా, వెంటనే మిషన్ భగీరథ అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటిని తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.