రెవెన్యూమంత్రి పేరుతో వసూళ్లు
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరి అరెస్ట్
✍️ హైదరాబాద్ – దివిటీ (ఏప్రిల్ 25)
రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏలుగా (పర్సనల్ అసిస్టెంట్లుగా)తమను తాము చెప్పుకుంటూ అమాయకులను మోసగిస్తున్న ఇద్దరు వ్యక్తులను నాగోల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి కార్యాలయం నుంచి వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బుస్సా వెంకటరెడ్డి (వయస్సు 34), మచ్చ సురేష్ (వయస్సు 30) హైదరాబాద్ నాగోల్లో నివాసముంటున్నారు. వీరిద్దరు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పీఏలమంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫోన్లుచేసి మరీ డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయం మంత్రి దృష్టికి వచ్చిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక నుంచి తన పీఏలమంటూ ఎవరైనా ఫోన్ చేస్తే, ఎలాంటి చిన్న అనుమానం కలిగినా రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయం 040-23451072, 040-23451073 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలకు సూచించారు. ఎవరైనా ఈ విధంగా అధికారాన్ని దుర్వినియోగపరిస్తే కఠినచర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.