ఇందిరమ్మ గృహం బిల్లులో మోసం…
పట్టించిన సాంకేతికత, ఉద్యోగిపై చర్యలు
✍️ భద్రాచలం – దివిటీ (ఏప్రిల్ 18)
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బిల్లులకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగిన మోసాన్ని ఆధునిక సాంకేతికతో గుర్తించారు. ముఖ్యమంత్రి గృహనిర్మాణ శాఖ మంత్రి ఆదేశాల మేరకు, జనవరి 26నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం అమలు ప్రారంభించిన విషయం తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి, సొంత స్థలం ఉన్న వారికి తొలి ప్రాధాన్యతగా ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులకు ముందుగా పంచాయతీ కార్యదర్శి గానీ వర్క్ ఇన్స్పెక్టర్ గానీ మార్కింగ్ ఇచ్చిన తర్వాత, బేస్మెంట్ స్థాయి వరకు పూర్తిచేసిన నారికి మొదటి విడత బిల్లు చెల్లిస్తారు. ఆ పంచాయతీ కార్యదర్శిగానీ సిబ్బందిగానీ తమ లాగిన్ ద్వారా ఫొటోతీసి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలి. భద్రాచలం గ్రామ పంచాయతీ లో మాత్రం ఓ ఉద్యోగి సరైన విచారణ చేయకుండా పునాదుల స్థాయి వరకు నిర్మించని లబ్దిదారులకు బిల్లుల కోసం ఆన్ లైన్లో ఫొటోలు అప్ లోడ్ చేశాడు. చేసిన ఈ తప్పును ఆధునిక సాంకేతికత ద్వారా అధికారులు గుర్తించి విచారణ జరిపారు. దీనికి బాధ్యుడుగా గుర్తించిన పూసా జగదీష్ అనే వ్యక్తిని విధులలో నుంచి తొలగించారు. ఇకముందు ఇలాంటి పొరపాట్లు జరుగకుండా చూడాలని అందరు అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు, ఎక్కడైనా ఇలాంటి పొరపాట్లకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.