తెలంగాణ లోకాయుక్త ఛైర్మన్ గా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి

✍️ హైదరాబాదు – దివిటీ (ఏప్రిల్ 12)
తెలంగాణ లోకాయుక్తగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డిని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేసింది.
జస్టిస్ రాజశేఖర్ రెడ్డి 1960 మే 4న నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని సిర్సనగండ్ల గ్రామంలో రైతుకుటుంబంలో జయప్రద, రామానుజరెడ్డి దంపతులకు జన్మించారు. మిర్యాలగూడ, నల్గొండ పట్టణాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. అనంతరం హైదరాబాదులో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తిచేసిన ఆయన కాకతీయ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ (గోల్డ్ మెడలిస్ట్) పొందారు. 1985 ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 2004లో కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. 2005 నుంచి 2009 వరకు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ గా కొనసాగారు. 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2014 సెప్టెంబరులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై 2022 మే నెలలో పదవీ విరమణ పొందారు. 2024 జూన్ లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) ఛైర్మన్ గా నియమితులై కొనసాగుతున్నారు. ఆయన తెలంగాణ లోకాయుక్త ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

