రోటరీ నిధులు 30 లక్షలు వెనుకకు వెళ్ళిపోతాయి
చెరువు అభివృద్ధి గురించి పట్టించుకోండి
ఎమ్మెల్యే పాయంకు రొటేరియన్ బూసిరెడ్డి బహిరంగ లేఖ
✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 29)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలురెడ్డిపాలెంలోని ఊరచెరువు అభివృద్ధికి తాను రోటరీక్లబ్ నుంచి మంజూరు చేయించిన రూ.30 లక్షలు వెనుకకు వెళ్లిపోకుండా, చెరువు అభివృద్ధికి సహకరించాలని రోటరీక్లబ్ మాజీ గవర్నర్ బూసిరెడ్డి శంకర్ రెడ్డి ఓ బహిరంగలేఖలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లును కోరారు. ఈ మేరకు ఆయన శనివారం విడుదలచేసిన లేఖలో చెరువు అభివృద్ధి అనుమతుల విషయంలో నిబంధనలలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికునిగా, తెలంగాణ రాష్ట్రంతోపాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా-3150కు 2023-24 సంవత్సరం గవర్నర్ గా సేవలందించిన తాను, తన స్వగ్రామమైన నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఉన్న ఊరచెరువు అభివృద్ధి కోసం రూ.30 లక్షలు బడ్జెట్ కేటాయించినట్లు పేర్కొన్నారు. దాదాపు సంవత్సరంన్నర పైగా జిల్లాకలెక్టర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ ఊర చెరువు అభివృద్ధికి అనుమతుల కోసం లేఖలు సమర్పించినట్లు వెల్లడించారు.
ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో రెండు నెలల క్రితం ప్రస్తుత జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ను కలిసి పరిస్థితి వివరించినట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి, సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులకు సమాచారం పంపించి రోటరీక్లబ్ వారికి కావలసిన అనుమతులు వెంటనే ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు తెలిపారు. తహసీల్దారు ఆదేశాలమేరకు నాగినేనిప్రోలురెడ్డిపాలెం గ్రామపంచాయతీ గ్రామసభ నిర్వహించి, చెరువు అభివృద్ధి చేయడం వల్ల తమకు ఏ రకమైన ఇబ్బంది లేదని నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఏకగ్రీవ తీర్మానంతో ఇచ్చినట్లు వెల్లడించారు. కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పొమ్మనలేక పొగ పెట్టినట్లుగా మూడు వైపుల కట్టనిర్మాణం చేయొద్దని, చెరువు లోతట్టు మట్టి తీయొద్దని, తీసిన మట్టిని కట్టనిర్మాణానికి వాడొద్దని, రైతులకు ఇవ్వలేదని, తదితర అసంబద్ధ ఆంక్షలతో పర్మిషన్ ఇచ్చినట్లు బూసిరెడ్డి తన లేఖలో పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము చెరువు నిర్మాణాన్ని ప్రారంభించలేమని జిల్లా కలెక్టరుకు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు అనేకమార్లు తెలియపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ఏమాత్రం స్పందన లేనందున చెరువు అభివృద్ధిని పట్టించుకోవడం లేదని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం వద్ద నిధులు లేవంటున్నారు, మరోవైపు ఒక అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ నిధులు తీసుకువచ్చి చెరువును మినీ ట్యాంక్ బండ్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చామన్నారు. రైతులకు ఒక పంటకు నీరందించడమే కాకుండా అందులో పెడల్ బోటింగ్ చేయడం వల్ల పిల్లలు బోటింగ్ ద్వారా ఆనందిస్తారని, గ్రామస్తులు వాకింగ్ చేయడానికి, ఉదయం సాయంత్రం సేద తీరడానికి బల్లలు వేయించి, విద్యుత్తు కాంతులతో సుందరీకరించడంవల్ల ఆహ్లాదకర వాతావరణంలో గ్రామస్తులు ఆనందిస్తారని తాము చెరువు అభివృద్ధి కోరుకుంటుంటే, స్థానిక శాసనసభ్యుడిగా పట్టించుకోకపోవడం బాధాకరం, దురదృష్టకరం అని పేర్కొన్నారు. కాబట్టి ఈ చెరువు అభివృద్ధిపై సత్వరం దృష్టి సారించి తమకు తగిన అనుమతులు మంజూరు చేయించినట్లయితే, చెరువు అభివృద్ధి పనులు సత్వరం ప్రారంభించగలమన్నారు. లేదంటే తాము తెప్పించిన రూ.30లక్షలు రోటరీ ఇంటర్నేషనల్ కు వెనుకకు తిప్పి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఆ బహిరంగలేఖ ప్రతిని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజ్ కు తగు సమాచారం కోసం పంపిస్తున్నట్లు కూడా బూసిరెడ్డి శంకర్ రెడ్డి పేర్కొన్నారు.