Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsSpot NewsTelanganaYouth

‘రూట్ మార్చిన’ గంజాయి స్మగ్లర్లు…

‘రూట్ మార్చిన’ గంజాయి స్మగ్లర్లు…

తనిఖీల నుంచి తప్పించుకునేందుకు బూర్గంపాడు మీదుగా…

121.14 కిలోల గంజాయితో బూర్గంపాడు పోలీసులకు పట్టుబడిన ఇద్దరు

✍️ బూర్గంపాడు – దివిటీ (మార్చి 22)

భద్రాచలంలో పోలీసుల తనిఖీలుండగా, ‘రూట్ మార్చిన’ గంజాయి స్మగ్లర్లు పడవ తో గోదావరి దాటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మీదుగా అక్రమ రవాణా సాగిస్తున్న విషయం వెల్లడైంది. బూర్గంపాడు సమీపంలోని ఏపీ బోర్డర్, సమ్మక్క- సారక్క గద్దెల వద్ద ఓ కారులో ఇద్దరు వ్యక్తులు తరలిస్తున్న దాదాపు రూ.60 లక్షల విలువైన 121.14 కిలోల గంజాయిని శనివారం ఎస్సై రాజేష్, టాస్క్ ఫోర్స్ బృందం ఆధ్వర్యంలో పోలీసులు పట్టుకున్నారు.
పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్, సీఐ సతీష్ మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఎస్సై రాజేష్, టాస్క్ ఫోర్స్ బృందం, తమ సిబ్బందితో కలసి వాహనాలు తనిఖీ చేస్తుండగా, బాలెనో కారు (నెం.TS08JQ 2960)లో ఇద్దరు వ్యక్తులు అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వారిని పోలీసులు బూర్గంపాడు మండలం సారపాకలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన కారు డ్రైవర్ వాంకుడోతు సాయికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామ రాజు జిల్లా, కూనవరం మండలంలోని, పోలిపాక గ్రామానికి చెందిన యువకుడు ప్రస్తుతం ఐటీసీ పరిశ్రమలో తాత్కాలిక కార్మికుడిగా పనిచేస్తున్న ఎడముత్యం వంశీ అలియాస్ బంటు అనేవారుగా గుర్తించారు. వారిద్దరితో పాటు ఈ అక్రమరవాణాతో సంబంధమున్న మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వారిని ఎస్కే.మున్వర్,
రమేష్ అలియాస్ రమ్మీ, కర్వాల సురేష్,
జగదీశ్ అలియాస్ జగ్గు, స్వరూప్,పడవ నడిపే ఎల్లాజి, ప్రస్తుతం మహారాష్ట్రలోని షోలాపూర్ లో నివాసముంటున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం, బొమ్మనపల్లికి చెందిన వాంకుడోతు సురేష్ అనేవారుగా ప్రకటించారు. వీరికి గంజాయి అమ్మిన వ్యక్తిని కలిమెల గ్రామానికి చెందిన భీమ అనే వ్యక్తిగా గుర్తించారు. బాలెనో కారులో గంజాయి తరలిస్తూ పట్టుబడిన వాంకుడోతు సాయికుమార్, ఎడముత్యం వంశీ అలియాస్ బంటులను విచారించగా వివరాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. గతంలో గంజాయి కేసులలో నిందితులుగా ఉన్న ఎస్కే.మున్వర్, రమేష్ అలియాస్ రమ్మి, కత్వాల సురేష్, జగదీశ్ అలియాస్ జగ్గు, వాంకుడోతు సాయికుమార్ లు కలసి మళ్లీ గంజాయి వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. షోలాపూర్ కు చెందిన వాంకుడోతు సాయికుమార్, తన బాబాయి అయిన వాంకుడోతు సురేష్ కు గంజాయిని తీసుకెళ్లి కొత్తగూడెం సమీపంలోని ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మున్వర్, రమేష్ కత్వాల సురేష్, జగదీశ్, వాంకుడోతు సాయికుమార్ కలసి భద్రాచలంలో కారు అద్దెకు తీసుకుని పోలిపాక వెళ్లి, అక్కడి నుంచి కొన్న గంజాయిని గోదావరి దాటించేందుకు స్వరూప్, పెడముత్యం వంశీల సహాయంతో పడవ నడిపే ఎలాజితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అక్కడ్నుంచి నిందితులు మోటు గ్రామం వద్ద కలిమెలకు చెందిన భీమ నుంచి 55 ప్యాకెట్లలో మొత్తం 121.140 కిలోల గంజాయి కొనుక్కుని కారులో పోలిపాక వచ్చారు. మిగిలిన వారిని అక్కడే దింపి కారులో కుక్కునూరు మండలం వింజరం గ్రామానికి వచ్చి వేచి ఉండగా, మిగిలిన వాళ్లు పడవలో ఎల్లాజి సహాయంతో గోదావరి దాటి వచ్చి ఆ గంజాయిని కారులో పెట్టారు. సాయికుమార్, వంశీ కారులో గంజాయితో వస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. రూ.60,57,000 విలువైన గంజాయి, బాలెనో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్న పోలీసుల ఇద్దరు నిందితులను కోర్టు ద్వారా రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఉన్న మిగతా నిందితులను కూడా త్వరలోనే పట్టుకుని రిమాండ్ చేయిస్తామని ఈ సందర్భంగా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని డీఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు. మీడియా సమావేశంలో పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపాడు ఎస్ఐ రాజేష్, టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రవీణ్, ఎస్సై రామారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సీతారామ ప్రాజెక్టుపై ముగ్గురు మంత్రుల సమీక్ష

Divitimedia

కొత్తగూడెం త్రీటౌన్ పోలీసుస్టేషన్ లో ఆకట్టుకున్న ‘ఓపెన్ హౌస్’

Divitimedia

పొంగులేటి సమక్షంలో కాంగ్రెసులో చేరిన బెల్లంకొండ రామారావు

Divitimedia

Leave a Comment