ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు పకడ్బందీగా పరిశీలించాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (మార్చి 6)
ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు పకడ్బందీగా పరిశీలించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు, పెండింగ్ ఎల్ఆర్ఎస్, ధరణి దరఖాస్తులపై అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలసి ఆయన టెలి కాన్ఫరెన్సులో సమీక్షించారు. జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, హౌసింగ్ పీడీ శంకర్, ఆర్డీఓ, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో జరిగిన సమీక్షలో దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజారు కోసం వచ్చిన దరఖాస్తులు పారదర్శకంగా పరిశీలించి, వాటిని మూడు జాబితాలుగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 గా విభజించాలని ఆదేశించారు. పేదల్లో అత్యంత పేదలకు, దివ్యాంగులకు, ఏ ఆధారం లేని వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ దరఖాస్తుల పరిశీలన వివరాలను ప్రతిరోజు నివేదిక అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నేరుగా క్రమబద్ధీకరణ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించారు. మార్చి 31 లోగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్న వారికి ఎల్ఆర్ఎస్ ఫీజులో రాయితీ వర్తిస్తుందన్నారు. ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం సద్వినియోగం చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తక్కువ సంఖ్యలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులు రెండురోజుల్లో పూర్తి చేయాలని కూడా ఆదేశించారు. ధరణి మాడ్యూల్ లో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ స్థాయిల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సత్వరమే పూర్తిచేయాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. వారం రోజుల్లో ధరణి మాడ్యూల్లో పెండింగ్ దరఖాస్తులన్నీ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.