Divitimedia
BusinessHealthHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsTechnologyTelangana

నూతన ఉస్మానియా ఆసుపత్రికి నెలాఖరులోగా శంకుస్థాపన

నూతన ఉస్మానియా ఆసుపత్రికి నెలాఖరులోగా శంకుస్థాపన

ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు

✍️ హైదరాబాద్ – దివిటీ (జనవరి 11)

హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలపై సీఎం తన నివాసంలో శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామహల్ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలనడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా వైద్య, ఆరోగ్య శాఖకు బదిలీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి ప్రతిపాదితస్థలంలో చేపట్టాల్సిన నిర్మాణాలకు సంబంధించిన నమూనా మ్యాప్‌లను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అధికారులు వివరించిన మ్యాప్‌ లలో ముఖ్యమంత్రి పలు మార్పులు, చేర్పులు సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఉండేలా ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు.
ముఖ్యంగా రోడ్లు, పార్కింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలు రూపొందించాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో రోడ్డు విస్తరణ, ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుచూపుతో డిజైన్లు రూపొందించాలన్నారు. అత్యాధునిక వసతులతోపాటు రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పార్క్ లాంటి సదుపాయాలు కూడా ఉండేలా చూడాలన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యాధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు.
కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవనాలు, ఇతర నమూనాలకు సంబంధించి పూర్తిస్థాయి డిజైన్లు రూపొందించాలని, ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులో శంకుస్థాపన చేసేందుకు వీలుగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Related posts

ప్రపంచ క్రికెట్ లో నెంబర్-1 టీమిండియా…

Divitimedia

కోవిడ్ పట్ల అప్రమత్తంగా వుండాలి : జిల్లా కలెక్టర్

Divitimedia

ఎన్నికల్లో సహకరించినవారందరికీ ధన్యవాదాలు

Divitimedia

Leave a Comment