ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై ‘సిట్’ ఏర్పాటు
✍️ అమరావతి – దివిటీ (డిసెంబరు 15)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమరవాణా నిరోధం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడ పర్యటనలో రేషన్ బియ్యం అక్రమాలను వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుబృందం (సిట్) ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్ర సీఐడీ విభాగం ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను ఆ సిట్ అధిపతిగా నియమించింది. ఆయనతో పాటుగా ఆ సిట్ బృందంలో సీఐడీ ఎస్పీ బి.ఉమామహేశ్వర్, మరో నలుగురు డీఎస్పీలు ఉంటారు. రేషన్ బియ్యంలో అక్రమాలు నిరోధించేందుకు తీసుకున్న ప్రత్యేక చర్యలను కూడా ప్రభుత్వం ఆ ఉత్తర్వులలో పేర్కొంది. రేషన్ బియ్యం అక్రమరవాణా చేస్తూ దొరికినవాహనాలు సీజ్ చేస్తారు. ఆ వాహనాల డ్రైవర్లకు 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు, రూ.10 వేల జరిమానా కూడా విధించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రేషన్ బియ్యంతో అక్రమంగా వ్యాపారం చేసేవారికి మాత్రం 10 సంవత్సరాల జైలుశిక్షతోపాటు రూ. 1లక్ష జరిమానా విధించేలా ప్రభుత్వం నిబంధనలు అమలు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.