ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాలు పకడ్బందీగా సేకరించాలి
ప్రభుత్వకార్యక్రమాలపై కలెక్టర్లతో సమీక్షలో మంత్రి
✍️ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 11)
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల మంజారు కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు 80 లక్షల మంది వివరాలను ఈ డిసెంబర్ చివరిలోగా పకడ్బందీగా సేకరించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాలు, గృహనిర్మాణశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం హైదరాబాదులోని సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సలహాదారు వేంనరేందర్ రెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వపథకాలు, కార్యక్రమాల అమలు తీరుతెన్నులపై సమీక్షించారు. ఇందిరమ్మ ఇళ్లు, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, డైట్ మెనూ ఛార్జీల పెంపు, సంక్షేమ హాస్టల్స్ తనిఖీలు , తదితర అంశాలపై జిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నేపథ్యంలో అమలుచేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ డిసెంబర్ 9 వరకు ఘనంగా నిర్వహించిన వేడుకలు, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల ఇంటింటి కుటుంబసర్వే విజయవంతంగా పూర్తి చేసిననందుకు కలెక్టర్లు,అధికారులు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డితో ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించుకున్నామన్నారు.
ప్రజాపాలన ద్వారా ఇందిరమ్మ ఇళ్లకోసం 80 లక్షల వరకు దరఖాస్తులొచ్చాయని, యాప్ ద్వారా దరఖాస్తుదారుల పూర్తి వివరాలు డిసెంబర్ నెలాఖరులోపు సేకరించాలని, ప్రతి 500 దరఖాస్తులకు సర్వే కోసం ఒక సర్వేయర్ ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు,కార్పొరేషన్లలో ఇందిరమ్మ కమిటీలు నియమించామని, వారిని సమన్వయం చేసుకుంటూ అన్ని వివరాల సేకరణ జరగాలని, షెడ్యూల్ ముందుగానే ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలకు తెలియజేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం ఇందిరమ్మ యాప్ ద్వారా సేకరించే డేటా రాబోయే 4 సంవత్సరాలు ఉపయోగపడుతుందనే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని పక్కాగా వివరాల సేకరించాలన్నారు. ఈ సర్వేలో ప్రతి దరఖాస్తు వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫొటో నమోదు చేయాలన్నారు. ప్రజా ప్రభుత్వం పిల్లలకు ప్రతిష్టాత్మకంగా అందించే డైట్ చార్జీలను 40 శాతం పెంచినందు వల్ల లాంచ్ కార్యక్రమంతో పాటు ఈ విద్యాసంస్థలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు మెరుగైన ఆహారం అందే విధంగా కృషి చేయాలన్నారు. హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, అందులో నూక అధికంగా వస్తుందనే ఫిర్యాదులున్నాయని, వీటిని పరిశీలించి నాణ్యమైన బియ్యం విద్యాసంస్థలకు చేరేలా చూడాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, ప్రజా పాలన ద్వారా సేకరించిన దరఖాస్తులలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేకు అవసరమైన సిబ్బందిని గుర్తించి, శిక్షణ కార్యక్రమం 2 రోజుల్లో పూర్తిచేయాలన్నారు. సర్వేకోసం నగరంలోని వార్డు అధికారులు, బిల్ కలెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు, రూరల్ ప్రాంతాల్లో గ్రామస్థాయి సిబ్బందిని సర్వేయర్లుగా నియమించాలన్నారు.
ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలకు, వివరాలసేకరణకు సిబ్బంది వస్తున్నారని సమాచారం ముందుగానే అందించాలని, సర్వే పట్ల ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కొత్తగా దరఖాస్తులు తీసుకోవద్దని, పాత దరఖాస్తుల పరిశీలన కోసం మాత్రమే సర్వే చేస్తున్నామన్నారు. సర్వేలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి సర్వేయర్ రోజుకు 20 దరఖాస్తుల సర్వే పూర్తిచేయాలన్నారు.
గ్రూప్ 2 పరీక్షలు ఎటువంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సీఎస్ అధికారులకు సూచించారు. ఈ నెల 14న జిల్లాల్లో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్, మోడల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలు, కేజీబీవీ లలో 40శాతం డైట్ చార్జీల పెంపును ఘనంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమానికి పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించాలని, ముఖ్యంగా తల్లి హాజరయ్యే విధంగా చూసుకోవాలన్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులకు స్పెషల్ ఆహారం అందించాలని, ప్రతి విద్యాసంస్థలో మెనూకు సంబంధించిన వివరాలతో ఫ్లెక్సీ ప్రచురించాలన్నారు. వంటగది నిర్వహణ, నాణ్యమైన ఆహారం అందించడం తదితర అంశాలపై స్టాఫ్ కు అవగాహన కల్పించాలన్నారు. డైట్ చార్జీల పెంపు కార్యక్రమంలో మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ డివిజన్ అధికారులు ఉన్నతాధికారులు పాల్గొనేలా చూడాలని సీఎస్ తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, గ్రూప్ 1 & గ్రూప్ 3 పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని, ఈ ఏడాదిలో చివరగా గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15, 16వ తేదీలలో 2 సెషన్స్ లో జరుగుతాయని అన్నారు. గ్రూప్ 2 పరీక్షల్లో అభ్యర్థులకు ప్రత్యేకంగా ఓఎంఆర్ షీట్ అందించడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ సంబంధించిన ఏర్పాట్లు, పాటించాల్సిన నియమాల గురిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. పరీక్ష చాలా కీలకమని, ఎక్కడా ఏ పొరపాటు జరగకుండా గ్రూప్ 2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను కోరారు. ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఒక ఓఎంఆర్ షీట్ ఇస్తున్నందున పరీక్షహాల్లో అభ్యర్థి రాక పోయినా అతనిస్థానంలో ఓఎంఆర్ షీట్, ప్రశ్నాపత్రం అలాగే పెట్టాలని, ఒకరి ఓఎంఆర్ షీట్ మరొకరికి ఇవ్వడానికి వీల్లేదని, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు సకాలంలో చేరుకునేలా ముందుగానే జిల్లాల్లో విస్తృతప్రచారం కల్పించాలని, పరీక్ష సమయాలు, గేటు మూసివేసే సమయం వంటి అంశాలు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జి.వి. పాటిల్ మాట్లాడారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక యాప్ సర్వే త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన వసతిగృహాల్లో 14న నిర్వహించే కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను, తల్లి దండ్రులను ఆహ్వానించాలని, ఏర్పాట్లు సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలు, వసతి గృహాల ఆవరణలలో మునగ, చింత, ఉసిరి, తులసి, వెలగ మొక్కలను విస్తృతంగా నాటాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడియో సమావేశంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, సీపీఓ సంజీవరావు, ఎస్సీ సంక్షేమ అధికారి అనసూయ, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.