ముక్కోటి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలి
సమీక్ష సమావేశలో కలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాచలం – దివిటీ మీడియా (డిసెంబరు 10)
రానున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు సజావుగా, ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో నిర్వర్తించాలని జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ ఆదేశించారు. మంగళవారం భద్రాచలంలో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ముక్కోటిఏకాదశి మహోత్సవాల సన్నాహక సమావేశంలో అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవ ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. లాడ్జి, హోటళ్ల ధరలు, నియంత్రించాలని ఆయన సూచించారు. సీసీటీవీలు ఏర్పాటు చేయాలని, భద్రాచలం, పర్ణశాలల్లో విద్యుత్ దీపాలంకరణలు, ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు, హంస వాహనం నిర్వహణ, గోదావరిలో బారికేడ్ల ఏర్పాటు తదితర అంశాలపై సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీచేసి నివేదికలు అందించాలని ఆహార తనిఖీ, తూనికలు, కొలతల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకటీములతో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. భక్తులకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని, బస్సులు, రైల్వే సమయాలను, జిల్లాలోని ప్రముఖ దర్శనీయ స్థలాలను తెలియజేసేలా చార్టులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి లోటుపాట్లు రాకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల వాహనాల పార్కింగ్ స్థలాలకు సైనేజ్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. భద్రాచలం కరకట్ట వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయడంలో అలసత్వం వహించిన అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భద్రాచలం ప్రాముఖ్యతను తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సంప్రదాయ వంటకాలు, వస్తువులు ప్రతిబింబించేలా స్టాల్స్ ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. భద్రాచలం ప్రాముఖ్యత తెలిపే విధంగా దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో గోడ పత్రికలు ఏర్పాటయ్యే విధంగా ప్రణాళిక రూపొందించాలని జిల్లాకలెక్టర్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం ప్రాంత పర్యాటక అభివృద్ధికి గిరిజన మ్యూజియం, గిరిజనుల సాంప్రదాయం ఉట్టి పడేలా, పర్యాటకులు ఆహ్లాదకరంగా గడిపే విధంగా దుమ్ముగూడెంలో నిర్మాణాలు, కిన్నెరసానిలో పుట్టి ప్రయాణం, కాటేజీల నిర్మాణం చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో గుంతలు పడిన రోడ్డును రెండు రోజుల్లో వెట్ మిక్సర్ తో పుడ్చాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, ఈవో రమాదేవి, భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు, పలువురు జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.