‘ఐసీడీఎస్’లో విచారణ బుట్టదాఖలేనా… ?
నెల కావస్తున్నా… అధికారులకందని నివేదిక…
ఇదొక్కటే కాదు, చాలా పనులున్నాయన్న ఆర్జేడీ
తప్పించుకునేందుకు అక్రమార్కుల తంటాలు
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 10)
‘అక్రమార్కుల’కు అవకాశాలు మెండుగా ఉంటున్న
ఐసీడీఎస్ లో అధికారుల అవినీతి, అక్రమాలు బయట పడటమే అరుదైన విషయమనుకుంటే, బయటపడిన అక్రమాలపై విచారణ, చర్యలు బుట్టదాఖలవుతున్న దుస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. విచారణ జరిగి నెలరోజులు కావస్తున్నప్పటికీ, అందుకు సంబంధించిన నివేదిక ఉన్నతాధికారులకు ఇంకా అందని వైనమిది… ఆద్యంతం అనుమానాస్పదంగా ఉన్న ఈ ఉదంతంపై ‘దివిటీ మీడియా’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం సృష్టించిన ఐసీడీఎస్ అక్రమాలు, వసూళ్లపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ) ఝాన్సీ లక్ష్మీభాయి నవంబరు 12, 13 తేదీలలో విచారణలు జరిపారు. ఐసీడీఎస్ టేకులపల్లి, పాల్వంచ ప్రాజెక్టుల్లో అక్రమ వసూళ్లు, అస్తవ్యస్త పరిస్థితులపై నవంబరు 10 వ తేదీన “దివిటీ మీడియా”లో “సంక్షేమం మాటున చక్కగా వసూళ్లు” శీర్షికతో సమగ్ర కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ కథనంపై మహిళా,శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్ ఆర్జేడీ టేకులపల్లి, పాల్వంచ ప్రాజెక్టులలో రెండు రోజులపాటు విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీభాయి, ఆ రెండు ప్రాజెక్టుల పరిధిలోని అంగన్వాడీ టీచర్లతోపాటు సూపర్ వైజర్లు, సీడీపీఓల నుంచి వివరాలు తీసుకుని, వాంగ్మూలాలను సేకరించారు. ఇదే అంశంలో గతంలో చేసిన ప్రాథమిక విచారణలో పాల్వంచ ప్రాజెక్టు అధికారి, ఉద్యోగులతో కుమ్మక్కై ఇంటిఅద్దెల బిల్లుల్లోనూ భారీగా ముడుపులు తీసుకున్నట్లు వెల్లడైంది. ఆ వసూళ్ల కోసం అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లను మధ్యవర్తులుగా వాడుకోవడం గురించి ‘క్లియర్’గా బయటపడినట్లు గుర్తించారు. ఈ పరిస్థితులలో అక్రమ వసూళ్లకు పాల్పడిన అధికారులు తాజా విచారణలో చర్యల నుంచి బయటపడేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబరు 12, 13 తేదీల్లో పాల్వంచ ప్రాజెక్టులో ఆర్జేడీ విచారణలోనూ పలువురు అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు తమ వాంగ్మూలాలు ఇచ్చారు. అవినీతిపరులైన సీడీపీఓల వల్ల తాము పడిన ఇబ్బందులు, బాధల గురించి కూడా మౌఖికంగా విచారణలో పంచుకున్నారు. పర్యవేక్షణ పక్కన పెట్టి మరీ ఆ సీడీపీఓలు, వారికి సహకరించిన కార్యాలయ సిబ్బంది పలువురు మధ్యవర్తుల సహాయ సహకారాలతో తీవ్రస్థాయిలో వత్తిడితో పర్సెంటేజీలు దండుకున్నది వాస్తవమేనని పలువురు విచారణలలో చెప్పారు. అవినీతి సీడీపీఓల తర్వాత వారి స్థానాలలో బాధ్యతలు చేపట్టిన సీడీపీఓలు కూడా ఈ అక్రమాలపై తమకు తెలిసిన సమాచారం విచారణలో కుండబద్దలు కొట్టడం విశేషం. మరికొందరు మాత్రం ఆ సీడీపీఓలతో తమకున్న సంబంధాలు, అనుబంధాలు, భయాలతో అనుకూలంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఆ విచారణలో పలువురు అంగన్వాడీ టీచర్లు స్వేచ్ఛగా అభిప్రాయాలు తెలియజేయకుండా రకరకాల ప్రభావాలకు లోనైనట్లు సమాచారం. మొత్తం మీద జిల్లాతోపాటు రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ అక్రమాల వ్యవహారాలలోనే ఉన్నతాధికారులకు ఇంకా నివేదికలు అందకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన సీడీపీఓలు, కార్యాలయ ఉద్యోగులు తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూసుకునేందుకు రక రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. విచారణ జరిపి నెలరోజులు కావస్తున్నా, ఆ నివేదికలు ఇంకా ఉన్నతాధికారులకు చేరకపోవడం పలురకాల అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. ఈ అంశంపై ‘దివిటీ మీడియా’ విచారణాధికారి, వరంగల్ ఆర్జేడీ ఝాన్సీలక్ష్మీభాయిని సంప్రదించగా, ఈ విచారణ ఒక్కటే కాకుండా తమకింకా చాలా పనులున్నాయని వ్యాఖ్యానించడం విశేషం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఐసీడీఎస్ శాఖలో అనేక ఆరోపణలు, వివాదాల తర్వాత నిర్వహించిన విచారణ ఏమైందనేది ఇంకా అంతుపట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రభావం ఇతర ప్రాజెక్టులపై కూడా తీవ్ర స్థాయిలో పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంలో బాధ్యులైన అవినీతి అధికారులను త్వరగా గుర్తించి, చర్యలు తీసుకోవాలని పలువురు సామాజిక కార్యకర్తలు, సామాజికవేత్తలు కోరుతున్నారు.