Divitimedia
Bhadradri KothagudemBusinessCrime NewsLife StyleSpot NewsTelangana

భారీగా ఇసుక సీజ్ చేసిన రెవెన్యూశాఖ

భారీగా ఇసుక సీజ్ చేసిన రెవెన్యూశాఖ

ఐటీసీని ఆధారాలు కోరిన అధికారులు

రోజంతా విచారణ సాగించినా స్పష్టత కరవు

✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 2)

ఓ పెద్ద గుట్టను తలపించేలా నిల్వ ఉన్న దాదాపు రూ. 10లక్షలకు పైగా విలువైన ఇసుకకు యజమానులెవరో తేల్చలేక రెవెన్యూశాఖాధికారులు సతమతమవుతున్న పరిస్థితి ఏర్పడింది. బహిరంగంగానే కనిపిస్తున్న ఇసుక నిల్వకు యజమానులెవరో తెలుసుకునేందుకు ఐటీసీ యాజమాన్యాన్ని రెవెన్యూశాఖ అధికారులు, సిబ్బంది వివరాలు కోరారు. భారీస్థాయిలో నిల్వ ఉన్న ఆ ఇసుక కుప్పలు సారపాక ఐటీసీ పేపర్ పరిశ్రమ పరిధిలో ఉన్న స్థలంలో ఉండటం వల్ల ప్రస్తుతం సంస్థ యాజమాన్యం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమసంస్థ అవసరాలకోసం స్థానిక కాంట్రాక్టర్ల నుంచి ‘మెటీరియల్’ తీసుకుంటోంది. ఆ మెటీరియల్స్ లో ఒకటైన ఇసుకను కూడా సరఫరాదారులతో ఒప్పందం చేసుకుని ఆ సంస్థ తెప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఐటీసీ సంస్థకు చెందిన స్థలంలో భారీగా నిల్వఉన్న ఇసుక ఎక్కడ్నుంచి
వచ్చిందనే విషయంపై రెవెన్యూశాఖాధికారులు తగిన సమాచారం, ఆధారాల కోసం ఆ సంస్థ యాజమాన్యం ప్రతినిధులను సంప్రదించినప్పటికీ, ఆధారాలు, స్పష్టత ఇవ్వలేదని చెప్తున్నారు. ఓ కాంట్రాక్టరుకు చెందినదిగా చెప్తున్న ఆ ఇసుకను సంస్థ స్థలంలో నిల్వ చేసుకునేలా ఏ విధంగా అనుమతిచ్చారనేది చెప్పలేకపోతున్నట్లుగా రెవెన్యూ అధికారులు చెప్తున్న సమాచారం. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా కాంట్రాక్టర్లకు చెందిన ఆ ఇసుకను ఐటీసీ సంస్థకు చెందిన స్థలంలో అనధికారిక పద్ధతిలో ఎందుకుంచారని ప్రశ్నించినప్పటికీ రెవెన్యూ శాఖాధికారులకు స్పష్టత రాకపోవడం విశేషం. సంస్థ పరిధిలో ఉన్న ఆ ఇసుక వివరాలు, ఆధారాలు కోరిన రెవెన్యూ అధికారులు రోజంతా ఎదురుచూసి ఫలితం లేకపోయింది. ఒక్క ఉత్పత్తి విషయంలోనే కాకుండా యాజమాన్య వ్యవహారాల్లోనూ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు పాటిస్తారనే పేరున్న ఐటీసీ సంస్థలో ఇసుక కాంట్రాక్టర్ల నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా ఎందుకని ఇసుక నిల్వ చేసుకునేందుకు అనుమతించారనేదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారిక పద్ధతుల్లో ఇసుక సరఫరా చేస్తున్నట్లయితే కాంట్రాక్టర్లు, ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా, అధికారులు అడిగినప్పటికీ అవి చూపకుండా రోజంతా తాత్సారం చేయడంలోనే పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారంలో ఇసుకను సీజ్ చేసిన రెవెన్యూశాఖ అధికారులు, రోజంతా ఎదురుచూసినప్పటికీ తమకు కాంట్రాక్టర్లు ఎలాంటి ఆధారాలు చూపలేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో వివరాల కోసం ‘దివిటీ మీడియా’, బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్ ను సంప్రదించగా, తనకింకా ఆ వివరాలు అందలేదన్నారు. ఆర్ఐ ముత్తయ్యను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. ఆ ఇసుకకు సంబంధించి ఐటీసీ యాజమాన్య ప్రతినిథులను సంప్రదించినా, వారు తమకు ఎలాంటి ఆధారాలు, సమాచారం, వివరాలు ఇవ్వలేకపోయారని బూర్గంపాడు డెప్యూటీ తహసిల్దారు రాంనరేశ్ ‘దివిటీ మీడియా’కు తెలిపారు.

Related posts

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్

Divitimedia

జడ్పీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్

Divitimedia

సికిల్ సెల్ అనీమియా శాశ్వతంగా నివారించాలి

Divitimedia

Leave a Comment