తుఫాను పట్ల జాగ్రతలు తీసుకోవాలి : కలెక్టర్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (డిసెంబరు 1)
పెంబల్ తుఫాను పట్ల రైతులు జాగ్రతలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్ కోరారు. జిల్లాలోని రైతులు ప్రస్తుతం తుఫాను వాతావరణంలో వారి పంటలను కాపాడుకోవాలని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ వానాకాలంలో దాదాపు 1,64,000 ఎకరాల్లో వరి పండించగా, దాదాపు 65000 ఎకరాల్లో పంట కోతలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. దాదాపు లక్ష ఎకరాల్లో పంట కోతకు సిద్ధంగా ఉందని, ప్రస్తుత తుఫాను వల్ల రైతులు తమ పంటను కోయకుండా మూడు, నాలుగు రోజులపాటు వేచి చూసిన తర్వాత వరి కోసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 160 ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటివరకు 15,500 మెట్రిక్ టన్నులు కొనుగోలు పూర్తయిందని, మరో 4500 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో 3700 టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని, ఇంకా 600 టార్పాలిన్లు సోమవారం ఉదయానికి అందుబాటులో రానున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తమ ధాన్యాన్ని ఈ టార్పాలిన్లతో కప్పుకుని తడవకుండా జాగ్రతలు తీసుకుని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సూచనలు పాటించి రైతులందరూ తగిన జాగ్రతలు తీసుకోవాలని ఆయన కోరారు.