పాడిపశువుల పెంపకానికి చేయూత
పశువైద్య శిబిరం ప్రారంభించిన జిల్లా కలెక్టర్
✍️ బూర్గంపాడు – దివిటీ (డిసెంబరు 1)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాడిపశువుల పెంపకానికి మరింత చేయూతనందిస్తామని కలెక్టర్ జి.వి.పాటిల్ తెలిపారు. బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో ఆదివారం పివి.నర్సింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయల జాతీయ సేవా పథకంలో భాగంగా నిర్వహించిన పశువైద్య శిబిరాన్ని జిల్లాకలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పశువుల పెంపకం కష్టమైన పని అయినప్పటికీ, లాభాలు అర్జించవచ్చని తెలిపారు. ఒకప్పుడు రైతులు పాడిపశువులను పెంచాలంటే తెల్లవారుజాము నుంచే మేతవేయటం, పాలు పితకడం వంటి చాకిరీ ఉండేదని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపడం లేదన్నారు. ప్రభుత్వం పరంగా పాడిరైతులకు ఎన్నోరకాల ప్రోత్సాహాలనందిస్తుందని తెలిపారు. ఉపాధిహామీ పథకంలో పశువుల షెడ్లకు, మేత పెంపకానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. అవగాహనా రాహిత్యంతో రైతులు వీటిని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారన్నారు. ఏదైనా సాధించాలంటే, సొంత ఊర్లోనే సాధించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో స్థలాలు, గోపాలమిత్రలు అందుబాటులో ఉంటే పశువైద్యశాల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో పాడి సంపదను పెంచేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ చెప్పారు. పాడి పశువులకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని మరింత విస్తరింప జేసేందుకు చర్యలు చేపడతామన్నారు. వైద్య శిబిరాల నిర్వహణతో మరింత అవగాహన కలుగుతుందని, వీటిని పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పాడి రైతులకు ప్రభుత్వం పలు సబ్సిడీ పథకాలు అమలు చేస్తోందన్నారు. రైతులు వినియోగించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ శ్రీనివాసరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి బి.పురంధర్, పశు గణ అభివృద్ధి అధికారి డా.కిషోర్, సహాయ సంచాలకుడు సత్యప్రసాద్, రవీంద్రనాథ్ ఠాగూర్, యూనివర్సిటీ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.