Divitimedia
Andhra PradeshBusinessCrime NewsDELHIInternational NewsLife StyleNational NewsPoliticsSpot NewsWomen

అదానీతో జగన్ హయాంలో జరిగిన ఒప్పందం రద్దు చేయాలి

అదానీతో జగన్ హయాంలో జరిగిన ఒప్పందం రద్దు చేయాలి

ఏపీ సీఎం చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ

✍️ అమరావతి – దివిటీ (నవంబరు 25)

అదానీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం తక్షణం రద్దు చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి రాసిన ‘బహిరంగ లేఖ’ను సోమవారం మీడియాకు విడుదల చేశారు. ఆ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం వల్ల 25 ఏళ్లపాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై రూ. 1.50లక్ష కోట్ల భారం పడుతుందని ఆమె పేర్కొన్నారు.
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్లు ముడుపులు అందుకున్నారని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐతో గానీ సిట్టింగ్ జడ్జితోగానీ వెంటనే విచారణ జరిపించాలని కోరారు. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో లంచాలు తీసుకున్నట్లు ఇప్పటికే అమెరికాకు చెందిన
దర్యాప్తు సంస్థలు వెల్లడించాయని, అమెరికా కోర్టులో
తీవ్ర అభియోగాలు మోపబడ్డాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో దిగ్గజ వ్యాపారవేత్తగా అదానీ, భారత దేశం పరువు ప్రపంచం ముంగిట తీస్తే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంధ్ర రాష్ట్ర పరువు తీశారన్నారు. తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బ తీశారని, లంచాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని, రాష్ట్రాన్ని ఆర్థికంగా మరింత నష్టాల్లోకి నెట్టారని షర్మిల ఆరోపించారు. ఈ ఒప్పందం రాష్ట్రానికి పెనుభారంగా మారిందని చెప్తూ, వివరాలు ప్రకటించారు. అర్ధరాత్రి అనుమతుల వెనుక దర్యాప్తు జరగాలని ఆమె కోరారు. అదానీతో జరిగిన ఒప్పందాల రద్దుతో పాటు,కంపెనీని తక్షణమే బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని కోరారు. అదానీకి చెక్ పెడతారా? లేక పోతే మీరు అంటకాగుతారా..? అంటూ ఆ లేఖలో షర్మిల ప్రశ్నించారు. దేశం,రాష్ట్రం పరువు తీసేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో చర్చలు జరుగుతున్నా కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని, ముడుపుల అంశంలో కనీసం నోరువిప్పడం లేదంటే అదానీ మీకు కూడా ఆఫర్లు పెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయంటూ నిలదీశారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ ప్రాజెక్టుతోపాటు, రోప్ వే నిర్మాణం, బీచ్ శాండ్ ఉత్పత్తుల ప్రాజెక్టులు, కొత్తగా సోలార్, హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీకి కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోందని లేఖలో ఆరోపించారు. రాష్ట్రంలో సహజవనరుల
దోపిడీకి అదానీ చేసిన కుట్ర బహిర్గతం అయిందని, అమెరికా దర్యాప్తు సంస్థల ద్వారా అసలు విషయం బయటపడ్డాక, మళ్లీ మీరు కూడా ఆ కంపెనీతోనే ముందుకు వెళతారా? లేకపోతే రాష్ట్రంలో అదానీ గ్రూప్స్ ను బ్లాక్ లిస్ట్ లో పెడతారా? తేల్చుకోవాలని సీఎం చంద్రబాబును వై.ఎస్. షర్మిల డిమాండ్ చేశారు.
గంగవరం పోర్టును అదానీకి అమ్మడంపైనా విచారణ జరగాలని ఆమె కోరారు.

Related posts

దమ్మపేట ఆర్ఐ జబ్బా ఎర్రయ్యపై సస్పెన్షన్ వేటు

Divitimedia

గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

 తాగి బండి నడిపితే ఇంక అంతే సంగతులు

Diviti Media News

Leave a Comment