Divitimedia
Bhadradri KothagudemCrime NewsLife StyleSpecial ArticlesTelangana

బ్రిడ్జిలు కూల్చేదాకా నిద్రపోరేమో… !

బ్రిడ్జిలు కూల్చేదాకా నిద్రపోరేమో…!

మాకు నిబంధనలేంటి?… అధికారంలో అడ్డేంటి…?

✍️ కామిరెడ్డి నాగిరెడ్ది – దివిటీ మీడియా

“ఏది అక్రమం… ? ఏది సక్రమం… ? అధికారంలో ఉన్నాం, మాకు అడ్డేంటి?…” అంటూ రెచ్చిపోతున్నారు అక్రమార్కులు. మొన్నటిదాకా వాళ్లు దోచుకోలేదా? ఇప్పుడు మేమూ అంతే… అధికారం ఉన్నప్పుడే కదా సంపాదించుకునే అవకాశం… ? అనే రీతిలో యధేచ్ఛగా రాత్రిపగలూ తేడా లేకుండా దోపిడీ చేస్తున్నారు. చేసేదే అక్రమమైనప్పుడు ఏది ఎలా చేయాలనే రూల్స్ కూడా అవసరం లేదు కాబట్టి తామనుకున్నట్టే కానిచ్ఛేస్తున్నారు. అరవై ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న గోదావరి ‘బ్రిడ్జిల’కే పెను ప్రమాదం సృష్టిస్తున్నారు. ప్రజలకు ఏమైతే మాకేంటి? అన్నట్లుగా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కూడా ఏమీ చేయలేక చేష్టలుడిగి చూస్తున్నారు. తాము చేసే అక్రమాలకు ఎమ్మెల్యేలు, మంత్రుల అండదండలు ఉన్నాయని చెప్పుకుంటూ అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులు కూడా ‘రిస్క్’ తీసుకోలేక ‘కామ్’గా చోద్యం చూస్తున్నారు. ఇదంతా చూస్తుంటే అసలు అక్రమాలు చేసి దోచుకోవడానికే తామున్నామనేలా ఇష్టారీతిన సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. ప్రభుత్వం మారిన వెంటనే తమ అధికారపార్టీలోకి వచ్చి మరీ అక్రమ దందాలు చేస్తూ దోచుకుంటున్నవారినే ఆదర్శంగా తీసుకుంటున్న మరి కొందరు నాయకులు కూడా తామేమీ తక్కువకాదంటూ అదేరకమైన దందాలకు తెరలేపారు…

బూర్గంపాడు మండలం సారపాకలో యధేచ్ఛగా సాగిపోతున్న ఇసుక అక్రమ రవాణా కారణంగా అక్కడి గోదావరి బ్రిడ్జిలకు ప్రమాదమేర్పడింది. అక్రమ రవాణా కాబట్టి వెనుకాముందూ చూడకుండా సాగిస్తుండటంతో ఈ దుస్థితి తలెత్తింది. అరవై ఏళ్ల క్రితం నిర్మించిన పాత బ్రిడ్జి, ఇటీవలే ప్రారంభించిన కొత్త బ్రిడ్జిలకు అత్యంత సమీపంలో దాదాపు ఆరడుగుల నుంచి పదడుగుల లోతు ఇసుక తవ్వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్రిడ్జిలకు పునాదుల వద్ద ప్రమాదం పొంచి ఉంది. రెండువర్గాల అక్రమ ఇసుక రవాణాదారులు పోటీలు పడుతూ, ఈ దందా కొనసాగిస్తుండగా, అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు చోద్యం చూస్తున్నారు. ఇటీవలే ఆ ప్రాంతంలో రెవెన్యూ అధికారుల మీద దాడులు చేశారంటూ కొంత మందిపై కేసులు నమోదైనప్పటికీ ఈ అక్రమం మాత్రం ఆగడం లేదు. కొందరైతే ఏకంగా యంత్రాలు, లారీలతో అధికారిక అనుమతులున్న ఇసుకర్యాంపులను మించి ఇసుక అక్రమరవాణా చేస్తున్నారు. రాత్రి పగలనే తేడా కూడా లేకుండా సారపాకలో సాగుతున్న అక్రమ దందా వెనుక ప్రభుత్వ ప్రతినిథులే అండగా ఉన్నారంటూ ఆ అక్రమార్కులు బహిరంగంగా చెప్పుకుంటుండటం విశేషం. నిజంగానే పెద్దల అండదండలున్నాయో, లేదో తెలియదుగానీ వారిపై కఠినచర్యలు తీసుకునేందుకు మాత్రం అధికారులు ఆలోచిస్తున్నారు. సారపాకలో ఓ రేంజిలో యధేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమరవాణా గురించి జిల్లా ఉన్నతాధికారులకు తెలియకపోవడం కూడా ఉండదు. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఏమీ స్పందించకపోవడం చూస్తే, ఈ అక్రమార్కులకు కొమ్ముకాసే ఆ స్థాయి పెద్దలెవరనేదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఇసుక అక్రమ రవాణాలో వాహనాల వేగం కారణంగా మరణాలు సంభవిస్తున్నా, ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైన వందల కోట్ల రూపాయల విలువైన బ్రిడ్జిలకు ప్రమాదమేర్పడుతున్నా స్పందించకపోతే ఇటు అధికారులు, అటు ప్రభుత్వ పెద్దలపై ప్రజలలో మరింత వ్యతిరేకత పెరిగే ప్రమాదం కూడా ఉందని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇంత దారుణమైన పరిస్థితులను సృష్టిస్తున్న ఇసుక అక్రమ రవాణా పైన ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో? ఏం చర్యలు తీసుకుంటారో? వేచి చూడాల్సిందే… ************

ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టరుకు నివేదిస్తా : ‘దివిటీ మీడియా’తో బూర్గంపాడు తహసిల్దారు ముజాహిద్
************
బూర్గంపాడు మండలం సారపాకలో గోదావరి బ్రిడ్జిలకు కూడా ప్రమాదకరంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా గురించి జిల్లా కలెక్టరుకు నివేదిస్తానని మండల తహసిల్దారు ముజాహిద్ ‘దివిటీ మీడియా’కు చెప్పారు. జిల్లా కలెక్టర్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇటీవల రెవెన్యూశాఖ సిబ్బందిపై దాడి చేసినవారిపై కేసులు నమోదుచేశామని తెలిపారు.

Related posts

పాల్వంచ ప్రభుత్వాసుపత్రిలో వైద్య సేవలు భేష్

Divitimedia

మణుగూరు గిరిజన సంక్షేమ డిగ్రీకళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు ఆహ్వానం

Divitimedia

అతుకులబొంతలు… అక్కడక్కడా వదిలేసిన గుంతలు…

Divitimedia

1 comment

కలెక్టర్ ఆదేశిస్తే తప్ప కదలరన్నమాట…? – Divitimedia 27/11/2024 at 4:55

[…] బ్రిడ్జిలు కూల్చేదాకా నిద్రపోరేమో… ! […]

Reply

Leave a Comment