సర్వే వివరాలు పకడ్బందీగా ఆన్లైన్ చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జి.వి.పాటిల్
✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (నవంబరు 21)
జిల్లాలో ఈ నెల 9 నుంచి చేపట్టిన ఇంటింటి సర్వేలో సేకరించిన కుటుంబాల వివరాలు అత్యంత పకడ్బందీగా ఆన్లైన్ లో నమోదు చేయాలని డేటా ఎంట్రీ ఆపరేటర్లకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్ సూచించారు. ఐడీఓసీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లకు గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరై సూచనలు చేశారు. సర్వే విజయవంతంగా జరుగుతోందని, అదే తరహాలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఆన్లైన్ లో ప్రతి కుటుంబం వివరాలు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నామని చెప్పారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు అత్యంత కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. అన్ని కుటుంబాల వివరాలు అంశాలవారీగా ప్రత్యేక ఫార్మేట్లో నమోదు చేసేటప్పుడు తప్పులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అంశాల వారీగా ఒకటికి రెండుసార్లు సరిచూసుకున్న తర్వాత ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత ఆపరేటర్లపైనే ఉందని అన్నారు. ఒక్కొక్క ఆపరేటర్ కు నిర్దేశించిన కుటుంబాల సంఖ్య ఆధారంగా ఆన్లైన్లో వారి వివరాలు నమోదు చేస్తారని చెప్పారు. ఆన్లైన్ నమోదు ప్రక్రియను సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారని తెలిపారు. నమోదు ప్రక్రియపై డేటా ఎంట్రీ ఆపరేటర్లు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సంజీవరావు, మాస్టర్ ట్రైనీలు పాల్గొన్నారు.