టీటీడీ పాలకమండలిలో పలు నిర్ణయాలు
✍️ తిరుమల – తిరుపతి – దివిటీ (నవంబరు 18)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ లో పనిచేస్తున్న అన్యమతస్తులను వేరే చోటకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీనివాససేతు పేరును గరుడవారధిగా పునరుద్ధరించారు. గతంలో అప్పటి సీఎం చంద్రబాబు గరుడవారధి పేరుతో ఈ ప్రాజెక్టును ప్రారంభించగా, దానిని గత ప్రభుత్వం శ్రీనివాససేతుగా పేరు మార్చింది. ఇప్పుడు గరుడవారధిగా దాని పేరును కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడితే కేసులు నమోదు చేయాలని, శ్రీవాణిట్రస్ట్‌ను రద్దుచేసి, ఆ నిధులు ప్రధానమైన ట్రస్ట్‌కే తరలించాలని నిర్ణయించారు. శ్రీవాణి పథకం మాత్రం కొనసాగుతుందని, నిత్యాన్నదాన కార్యక్రమం మరింత మెరుగుపరుస్తామని ప్రకటించారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి నాణ్యతను మరింత పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఉద్యోగులకు 10 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, టూరిజంశాఖ ద్వారా ఇచ్చే టిక్కెట్లలో అవకతవకలు జరిగాయని, ఆ 4వేల టికెట్లను రద్దుచేయాలని నిర్ణయించారు. ఏఐ టెక్నాలజీ సహకారంతో సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అందేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అనేక ఏళ్ల తరబడి డంపింగ్ యార్డులో పేరుకుని ఉన్న చెత్త తొలగిస్తామని ప్రకటించారు. తిరుపతిలోని స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనం కోసం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. శారదాపీఠం లీజు రద్దు చేసి ఆ స్థలం స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన భూముల లీజు రద్దు చేయాలని, ప్రసాదాల తయారీ పోటుకు మరమ్మతులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ పాలకమండలి ఛైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు.