Divitimedia
Andhra PradeshCrime NewsLife StyleNational NewsPoliticsSpot NewsWomen

మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

మహిళలపై అత్యాచారాలు అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలం

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి

✍️ అమరావతి – దివిటీ (నవంబరు 18)

రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను అరికట్టడంలో పదేళ్లుగా టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలారెడ్డి ఓ ప్రకటనలో ఆరోపించారు. సోమవారం శాసనమండలిలో జరిగిన చర్చే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 2014నుంచి 19 వరకు రాష్ట్రంలో నమోదైనవి 83,202 కేసులైతే, ఆ తర్వాత 2019 నుంచి 24 వరకు 1,00,508 కేసులని ఆ చర్చలో బయటపడిందన్నారు. తమ పాలనలోకంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే 20 శాతం ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయని టీడీపీ చెప్తుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే రోజుకు సగటున 59 అత్యాచారాలు నమోదైనట్లు వైసీపీ మహిళల మాన, ప్రాణాల మీద రాజకీయాలు చేస్తున్నారన్నారు. గడిచిన పదేళ్లలో దాదాపు 2లక్షల కేసులు నమోదయ్యాయంటే
మహిళలకు భద్రత కల్పించడంలో రాష్ట్రం ఎక్కడుందో అర్థమవుతోందన్నారు. మహిళలపై క్రైమ్ అరికట్టలేని వైసీపీ, టీడీపీలు దొందూదొందేనని విమర్శించారు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన, సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమన్నారు. నిర్భయ, దిశ లాంటి చట్టాలు పేరుకే తప్ప అమలుకు నోచుకోలేదని ఆమె ఆరోపించారు. నిర్భయ చట్టం ప్రకారం మహిళలపై వికృత చేష్టలకు పాల్పడితే 40 రోజుల్లో కఠిన శిక్షలని చంద్రబాబు, దిశ చట్టం కింద 20 రోజుల్లోనే ఉరిశిక్ష పడేలా చర్యలంటూ జగన్ మహిళల చెవుల్లో క్యాలీఫ్లవర్లు పెట్టడం తప్పిస్తే
చట్టాలు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. భద్రత కోసం పెద్ద పీట అని ఆర్భాటపు ప్రచారాలు తప్ప, 10 ఏళ్లలో ఏ ఒక్క నేరస్థుడికీ కఠిన శిక్షలు పడలేదన్నారు. ఆ కేసులు చేదించాల్సిన పోలీసులను కక్ష్య సాధింపు రాజకీయాలకు వాడుతున్నారే తప్ప ఏనాడూ విధులు నిర్వర్తింపజేసింది లేదని షర్మిలారెడ్డి ఆరోపించారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో చివరి స్థానంలో, మాదక ద్రవ్యాల వాడకంలో, మహిళలపై అఘాయిత్యాలలో, ప్రథమ స్థానంలో ఉందని, ఇది మన రాష్ట్ర దుస్థితి అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

మోరంపల్లిబంజర్ క్రికెట్ లీగ్ -2023 విజేత డార్క్ లెవెన్

Divitimedia

పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్, అతిథిగృహం ప్రారంభించిన జిల్లా ఎస్పీ డా.వినీత్

Divitimedia

ఇంతేనా సంక్షేమం… మరీ ఇదేం నిర్లక్ష్యం…?

Divitimedia

Leave a Comment