పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి
ఉచిత వైద్య శిబిరంలో ఎస్పీ రోహిత్ రాజు
✍️ కొత్తగూడెం – దివిటీ (నవంబరు 6)
విధులలో చేరినప్పటి నుంచి శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజలకు సేవలందిస్తూ విశ్రాంతి లేని జీవితం గడపాల్సి వచ్చే పోలీసులు తమ ఆరోగ్య సంరక్షణ పట్ల జాగ్రత్తలు పాటించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం బుధవారం నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో భర్తీ అయినప్పుడు కఠినశిక్షణ, పూర్తి శారీరక సామర్థ్యంతో శిక్షణకేంద్రాల నుంచి ప్రజలకు సేవలందించడానికి వచ్చే పోలీసులు, తర్వాత చాలా సందర్భాల్లో నిద్రాహారాలు మాని విధులు నిర్వర్తించాల్సి వస్తుందన్నారు. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, అప్పుడప్పుడు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి సరిగా లేనప్పుడు కూడా తప్పనిసరిగా విధులు నిర్వర్తించాల్సి వస్తుందని అన్నారు. అందుకే జిల్లాలో పోలీసు అధికారులు, సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతోందని, జిల్లాలో సబ్ డివిజన్ల వారీగా పోలీసు అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్, సబ్ డివిజన్లోని అధికారులందరినీ జిల్లా ఎస్పీ అభినందించారు. నిత్యం ప్రజలకు సేవలందిస్తూ, తాము అడగగానే పోలీస్ కుటుంబాలకు కూడా వైద్యం చేయడానికి విచ్చేసిన వైద్య బృందానికి ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వైద్యశిబిరంలో పాల్గొన్న వైద్యులందరినీ శాలువాలు, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో ఈ ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించారు. పట్టణంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో ఈసిజీ, గైనకాలజీ, బీపీ, షుగర్, దంత సమస్యలు,కళ్ళ పరీక్షలు, ఆర్థోపెడిక్, యురాలాజీ, ఫిజియోథెరపీ, గుండె, రక్త పరీక్షలు వంటి సేవలందించారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, పట్టణంలో ప్రముఖ వైద్యులు నాగరాజు, కృష్ణప్రసాద్, రంగారావు, రాజశేఖర్, ప్రవీణ్, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, రమేష్, శివప్రసాద్, ఇంద్రసేనారెడ్డి, ఆర్ఐలు సుధాకర్, కృష్ణారావు, నరసింహారావు, లాల్ బాబు, పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.