ఈఎస్ఐ డిస్పెన్సరీ సందర్శించిన కార్మికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
✍️ బూర్గంపాడు – దివిటీ (అక్టోబరు 6)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఈఎస్ఐ I ఆసుపత్రిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఐటీసీ పి.ఎస్.పి.డి ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ, తదితర కార్మికసంఘాల నాయకులు యారం పిచ్చిరెడ్డి, గోనె రామారావు. కనకమేడల హరిప్రసాద్, తదితరులు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. సారపాక ఈఎస్ఐ ఆసుపత్రిలో కనీస సౌకర్యాల కల్పన గురించి కోరారు. దాదాపు 30వేలకు పైగా కార్మికులు ఆధారపడి ఉన్న సారపాక ఈఎస్ఐ ఆసుపత్రికి శాశ్వత భవనం నిర్మాణం చేపట్టాలని, పూర్తిస్థాయిలో 24 గంటలపాటు వైద్యసేవలందించే విధంగా డాక్టర్లను నియమించాలని కోరారు. అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇక్కడి ఈఎస్ఐని భద్రాచలంలో ఉన్న ప్రముఖ ఆసుపత్రులకు అనుసంధానం చేయలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కాంట్రాక్టు కార్మికుల సంఘం అధ్యక్షుడు ఉర్లుగొండ వీరన్న, ఇతర కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.