ప్రజాపాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యం
కొత్తగూడెంలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
✍️ కొత్తగూడెం – దివిటీ (సెప్టెంబరు 17)
ప్రజల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా తమ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రగతిమైదానంలో అమరవీరుల స్థూపం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జి.విపాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలతో కలిసి అమరవీరులకు నివాళులర్పించారు. ప్రకాశం స్టేడియంలో వ్యవసాయ, అనుబంధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. అందివచ్చిన ఆధునిక సాంకేతికత, అవకాశాలను అన్నదాతలంతా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, జారె ఆదినారాయణ, పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రత్యేకాధికారి హోదాలో జిల్లాకలెక్టర్ జితేష్ వి పాటిల్ పతాకావిష్కరణ చేశారు. ఐడీఓసీ కార్యాలయంలో జాతీయపతాకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలలో ఎస్పీ రోహిత్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, ప్రజలకు, పోలీస్ అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. సాయుధ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్స్ పంకజ్ పరితోష్, డీఎస్పీ రెహమాన్, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నాగరాజు, సీఐలు వెంకటేశ్వర్లు, కరుణాకర్, రమేష్, శివప్రసాద్, ఆర్ఐలు రవి, నరసింహారావు, లాల్ బాబు ఎస్సైలు, డిపిఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.