Divitimedia
Bhadradri KothagudemBusinessEntertainmentHyderabadKhammamLife StylePoliticsSpot NewsTelanganaTravel And Tourism

జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

జిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

ఉపముఖ్యమంత్రి బట్టి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి

✍️ భద్రాద్రి కొత్తగూడెం – దివిటీ (ఆగస్టు 12)

సహజ వనరులున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ‘పర్యాటకం’ అనే పదానికి ఒక పర్యాయపదంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కొత్తగూడెం వద్ద నిర్మాణంలో ఉన్న పర్యాటకశాఖ హోటల్, కిన్నెరసాని డ్యామ్, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పర్యాటక శాఖ అభివృద్ధి పనులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన కిన్నెరసాని ప్రస్తావన అనేకచోట్ల ఉందని, చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో విశాలమైన నీరున్న పర్యాటక ప్రాంతంగా మరింతగా అభివృద్ధి చేసేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు అన్నివిధాలా అవకాశముందన్నారు. ఇరిగేషన్, ఫారెస్ట్, విద్యుత్తు, పర్యాటక, తదితర శాఖల సమన్వయంతో అభివృద్ధి చేస్తామని, ఒక ప్రపంచస్థాయి సంస్థను ఎంపిక చేసి కిన్నెరసాని ప్రాజెక్టు అభివృద్ధి పనులు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. అధికారులు ఖమ్మం జిల్లా ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపితే కేంద్ర నిధులతో ముందుకు వెళ్తామని, పర్యాటకపటంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను తీర్చిదిద్దుతామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు నెలలో ఒకసారైనా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పర్యాటక ప్రాంతాల్లో విడిది చేయాలని సూచించారు. దీనివల్ల పర్యాటక ప్రాంతాలకు మరింత ప్రాచుర్యం లభిస్తుందన్నారు. దీని ద్వారా పర్యాటకుల సంఖ్యతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. టూరిజం ప్రమోషన్లో భాగంగానే తాము ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పర్యటించి, కిన్నెరసాని రిజర్వాయర్లో బోటు విహరం చేశామన్నారు. కిన్నెరసానిని వెడ్డింగ్ డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఐల్యాండ్స్ లో కాటేజీల నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు, సాధ్యాసాధ్యాలపై మంత్రులు, అధికారులతో వారు చర్చించారు. రూ.10.77 కోట్ల అంచనా వ్యయంతో కిన్నెరసానిలో జరుగుతున్న కాటేజీనిర్మాణాల పురోగతి పరిశీలించారు. కొత్తగూడెంలో రూ.12.36కోట్ల వ్యయం తో నిర్మిస్తున్న హరిత హోటల్, కన్వెన్షన్ సెంటర్ పనుల పురోగతిని పర్యవేక్షించారు. అన్ని హంగులతో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూడు నెలల్లో పనులు పూర్తవుతాయని అధికారులు వారికి వివరించారు. పర్యటనలో భాగంగా ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, జిల్లా కలెక్టర్ జి.వి.పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, తదితరులతో కలిసి కిన్నెరసాని ప్రాజెక్టులో బోటులో విహరించారు. కిన్నెరసాని అభయారణ్య ప్రాంతాన్ని, దీవులను పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కిన్నెరసాని ప్రాజెక్ట్, నీటి నిల్వల గురించి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, కిన్నెరసాని అభయారణ్యంలో జింకల పార్కు విస్తరణ చేపట్టడం ద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద ‘జింకలపార్కు’గా ఏర్పాటు చేయాలని కోరారు. దీంతో పాటుగా కిన్నెరసాని ప్రాజెక్టులో తీగల వంతెన, ట్రెక్కింగ్ సదుపాయాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం హోటల్స్ జీఎం నాథన్ కట్టి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, అటవీశాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ ఎన్నికల్లో అక్రమరవాణాకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయం

Divitimedia

పోలీసులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి

Divitimedia

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కొత్త ఎమ్మెల్సీలు

Divitimedia

Leave a Comment